ఆర్డర్లలో పారదర్శకత ఏది?

5 Oct, 2013 04:10 IST|Sakshi
ఆర్డర్లలో పారదర్శకత ఏది?

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మందగమనం నుంచి ఇంకా కోలుకోలేదు. రాష్ట్రంలో అయితే నాలుగేళ్లుగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈని ఆదుకోవాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్డర్లలో పారదర్శకత లోపించింది’ అని ఫ్యాప్సీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ ఎం.శ్రీరామ్మూర్తి అన్నారు. ఇందుకు సాక్షిలో ప్రచురితమైన కథనమే నిదర్శనమని తెలిపారు. ఆకాశ్ క్షిపణుల తయారీలో భాగంగా కొత్త వెండార్ల ఎంపిక విషయంలో బీడీఎల్ నిర్లక్ష్యంపై ఈ నెల 3న ‘ఆకాశ్’మంత అలక్ష్యం శీర్షికన సాక్షి ప్రత్యేక కథనాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఫ్యాప్సీలో శుక్రవారం జరిగిన కొనుగోలు-విక్రయందారుల సమావేశంలో సాక్షి కథనాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఘాటుగా మాట్లాడారు. వివిధ పీఎస్‌యూలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
 
 పెద్ద సంస్థలున్నా..
 పీఎస్‌యూలైన బీడీఎల్, హెచ్‌ఏఎల్, బీహెచ్‌ఈఎల్, డీఆర్‌డీవో, బీఈఎల్ వంటివి హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇక్కడి ఎంఎస్‌ఎంఈలు ఈ విషయంలో గర్వపడుతున్నాయని శ్రీరామ్మూర్తి అన్నారు. తయారీ రంగాన్ని కొన్ని పీఎస్‌యూలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో విభాగాల్లో సామర్థ్యం ఉన్న కంపెనీలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయని అన్నారు. ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్టులో పాలుపంచుకుని సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయని పేర్కొన్నారు. కొన్ని పీఎస్‌యూలు పాత వెండార్లతోనే సర్దుకుపోతున్నాయని, కొత్త వెండార్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటులో పూర్తిగా ఇక్కడి ఎస్‌ఎంఈల చొరవే కారణమని స్పష్టం చేశారు.
 
 పీఎస్‌యూలకూ సమస్యలే..
 నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేసే కంపెనీలు ఇక్కడ చాలా ఉన్నాయని ‘మిధాని’ సీఎండీ ఎం.నారాయణరావు కితాబిచ్చారు. పారదర్శకత కోసం ఇ-టెండర్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు. మేధోసంపత్తి హక్కుల విషయంలో పీఎస్‌యూలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మాస్టర్ పీస్‌ను పీఎస్‌యూ రూపొందించినా చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని హక్కులు తమవని కొందరు వెండార్లు అంటున్నారని పేర్కొన్నారు. కేరళ మినరల్స్, మెటల్స్ ఉత్పత్తి చేసిన టైటానియం వైమానిక అవసరాలకు పనికొస్తుందా లేదా అని తాము పరీక్షిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో టైటానియం కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు. రక్షణ రంగంలో ఉన్న 9 పీఎస్‌యూలు ఏడాదిలోగా నూరు శాతం ఇ-టెండర్ విధానాన్ని అనుసరించనున్నాయని పేర్కొన్నారు. పీఎస్‌యూల మద్దతు లేకపోతే ఎంఎస్‌ఎంఈలు మనలేవని ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ డెరైక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

>
మరిన్ని వార్తలు