పట్టిసీమతో ఒరిగేది ఏమీలేదు

26 Sep, 2015 00:44 IST|Sakshi
పట్టిసీమతో ఒరిగేది ఏమీలేదు

చిత్తూరు (అగ్రికల్చర్) : పట్టిసీమ వల్ల ఒరిగేది ఏమీ లేదని బీజేపీ కేంద్ర మహిళామోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం చిత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ పథకం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ఎంతవరకు నిజమని ఆమె ప్రశ్నించారు. గోదావరి నీటిని కృష్ణా నదికి మల్లిస్తున్నామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారని, అయితే ఇప్పటికే ప్రకాశం బ్యారేజికి 1,200 క్యూసెక్కుల నీరు చేరిందని, ఈ బ్యారేజిలోకి గోదావరి నీటిని తీసుకొచ్చి ఎక్కడ పోస్తారని ఆమె ప్రశ్నించారు. పట్టిసీమను మూడేళ్లు మాత్రమే కొనసాగిస్తామని ఇదివరలోనే చంద్రబాబు ప్రకటించారని, ఈ మేరకు ప్రభుత్వం జీవోలో కూడా తెలియజేసిందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే పట్టిసీమ వల్ల రాయలసీమకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో అర్థమవుతుందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయితే రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోలవరం నిర్మాణానికి గతంలో కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఖర్చులను చూపెట్టకపోయినా, మరో మారు రూ. 350 కోట్లను కేటాయించిందని చెప్పారు. అయినా ఇప్పటి వరకు 2 శాతం పనులను కూడా పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఇప్పటివరకు అధికార లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.26 కోట్ల ఘనపు మీటర్ల ఇసుకను తరలించినట్లు చూపెడుతున్నారన్నారు. అయితే వాస్తవానికి దాదాపు 4 కోట్ల ఘనపు మీటర్ల మేరకు రాష్ట్ర అధికార పార్టీ నాయకులు దోచుకున్నట్లు తెలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాభివృద్ధికి రూ. 1,500 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు ఎంత నిధులు ఖర్చుపెట్టారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు చూపడంలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోందో అర్థమవుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు