రాహుల్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు

15 Dec, 2016 09:38 IST|Sakshi
రాహుల్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు

భోపాల్‌: ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. రాహుల్‌ మాటలను ఎవరూ నమ్మరని, దేశంలో ఎవరు కూడా ఆయన్ను సీరియస్‌గా తీసుకోరని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా స్వాగతిస్తోందని చౌహాన్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అందుకే తనను పార్లమెంట్‌లో మాట్లాడనివ్వడం లేదని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాగా  మోదీపై రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారమని, ఆయన సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి అనంతకుమార్ అన్నారు. ఆధారాలుంటే రాహుల్ ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదని, పార్లమెంటులో ఆ ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు