పదవులొస్తున్నాయ్!

23 Sep, 2015 02:02 IST|Sakshi
పదవులొస్తున్నాయ్!

* దసరా నాటికల్లా నామినేటెడ్ పదవుల భర్తీ
* రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం
* టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. పార్టీ కమిటీలు, దేవాలయ కమిటీలను దసరా నాటికల్లా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. మార్కెట్ కమిటీల రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ కమిటీలకు చైర్మన్, ఇతర పాలక వర్గ సభ్యుల పేర్లతో జాబితా తయారు చేయాలని మంత్రులను ఆదేశించారు.

పార్టీ కార్యకర్తలకు జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ శాసన సభాపక్ష (ఎల్పీ) సమావేశంలో సీఎం ఈ మేరకు వెల్లడించారు. గంటకు పైగా జరిగిన భేటీలో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సభ్యులతో మాట్లాడారు. శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ నే తి విద్యాసాగర్‌ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యేల ద్వారా అందిన సమాచారం మేరకు ఎల్పీ సమావేశ వివరాలివీ.. ‘‘2019లోనూ మనదే అధికారం. అధికారంలోకి ఎలా రావాలో నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సింది మీరే. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉన్నాయి. సభలో హుందాగా వ్యవహరించండి. ప్రతీ రోజు సమయానికే సభకు హాజరు కావాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
 
ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం
రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా విద్యుత్ ఇచ్చాం. విత్తనాలు, ఎరువులు అందజేశాం. రుణాలు మాఫీ చేశాం. రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నాం’’ అని వివరించారు. రైతులకు ఏం చేశామో అసెంబ్లీ వేదికగానే చెప్పుకుందామని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు సహకరిస్తే సరే సరి.. సభను అడ్డుకుంటే మాత్రం ఎత్తి అవతల వేద్దామని, సమావేశాలను సజావుగా జరుపుకొందామని  అన్నారు. ‘‘ఎంఐఎం మన కు సహకరిస్తుంది. బీజేపీ కొద్దిగా గొడవ చేసినట్లు కనిపించినా.. వారు సభ నుంచి బయట కుపోవడానికి సిద్ధంగా ఉండరు. వామపక్షాల కు బలమే లేదు. ఇక, టీడీపీ, కాంగ్రెస్‌లు సాగనీయకుండా చేస్తే.. ఎలా కంటిన్యూ చేయాలో నాకు తెలుసు’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
 
సీపీఎంకు ఏపీలో సమస్యలు కనిపించవు..
‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సీపీఎం.. కొత్త రాష్ట్రంలోనూ తన పద్ధతి మార్చుకోలేదు. ఆ పార్టీ టీడీపీ అడుగులకు మడుగులు ఒత్తుతోంది. రైతు ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో కూడా జరుగుతున్నాయి. ఆ పార్టీకి ఏపీలో ఆశ వర్కర్ల సమస్యలు కనిపించవు. మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా అంతే. ఏపీలో వారి సమస్యలు సీపీఎంకు కనిపించవు. తెలంగాణలో మాత్రం అన్ని సమస్యలు కనిపిస్తాయి. వారిని ఎవరు నడిపిస్తున్నారో బహిరంగ రహస్యమే.

సీపీఎంకే కాదు.. ప్రతిపక్ష పార్టీలకు కూడా అసెంబ్లీలోనే సమాధానం చెబుదాం’’ అని కేసీఆర్ అన్నారు. స్పీకర్ అనుమతితో సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైనింగ్, రాష్ట్ర జల విధానం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సభ ద్వారా ప్రజలకు వివరిద్దామని కూడా సీఎం అన్నట్లు తెలిసింది. ప్రతిపక్షాలకు దీటుగా సమాధానాలిచ్చేందుకు ఆరేడు మంది మంత్రులు సమన్వయం చేసుకోవాలని, ఇష్యూలను బట్టి ఎప్పటికప్పుడు చీఫ్ విప్, విప్‌లు చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. వరంగల్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొన్నారు.
 
సాగునీటి ప్రాజెక్టుల బాధ్యత మీదే..
ఏ జిల్లాకు ఆ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టంచేశారు. ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామని, పనులు పూర్తి చేసుకుంటే వెంట వెంటనే నిధులిస్తామని చెప్పారు. వాటర్‌గ్రిడ్‌లో అమలు పరిచిన గ్రీన్‌చానల్ విధానాన్నే సాగునీటి ప్రాజెక్టుల్లోనూ అమలు చే స్తామని, కాల్వలు, బ్యారేజీల పనులు ఏక కాలంలో జరగాలని సూచించారు.

బలహీన వర్గాల గృహ నిర్మాణంలోనూ ఈ ఏడాది ప్రతీ నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేస్తామని, వచ్చే ఏడాది నుంచి వెయ్యి ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. పార్టీ క్రియాశీలక సభ్యుల్లో 200 మంది చనిపోగా, 40 మందికి రూ.2 లక్షల చొప్పున బీమా సొమ్ము చెక్కులు అందించినట్లు మంత్రి హరీష్‌రావు ఎల్పీ సమావేశంలో సభ్యులకు వివరించారు.

>
మరిన్ని వార్తలు