యూపీ సీఎం రేసులో నేను లేను: కీలక నేత స్పష్టీకరణ

18 Mar, 2017 12:45 IST|Sakshi
యూపీ సీఎం రేసులో నేను లేను: కీలక నేత స్పష్టీకరణ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోనుండగా.. రేసులో కీలకంగా ఉన్న పలువురు నేతల మధ్య పోటీ తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్‌ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ఎంపీ యోగిఆదిత్యానాథ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పేర్లు కాకుండా పూర్తిగా కొత్త పేరు కూడా తుదిదశలో తెరపైకి రావొచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందంజలో ఉన్నట్టు భావిస్తున్న మనోజ్‌ సిన్హా తాజాగా స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనేలేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తాయని, తాను రేసులో ముందున్నాననని, తనకే అవకాశం వస్తుందంటూ జాతీయ మీడియా అనవసర కథనాలు వండి వారుస్తున్నదని ఆయన తప్పుబట్టారు.

మరోవైపు యూపీ సీఎం రేసు హీటెక్కింది. తమ నాయకుడికే సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ ఇటు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, అటు యోగి ఆదిత్యానాథ్‌ మద్దతుదారులు లక్నోలో రోడెక్కి బలప్రదర్శన ర్యాలీలు నిర్వహించారు. మౌర్య శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకొని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో మంతనాలు జరిపారు. సీఎం ఎంపికపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. లక్నోలో శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్‌ సమక్షంలో భేటీ అవ్వనున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య, ఇతర అధిష్ఠాన నేతలు ఇప్పటికే లక్నో చేరుకున్నారు. మార్చి 19న (ఆదివారం) పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకారం ఉండనుంది.

మరిన్ని వార్తలు