దేశం కోసమే..

7 Sep, 2017 02:06 IST|Sakshi
దేశం కోసమే..

సర్జికల్‌ దాడులు, నోట్లరద్దు, జీఎస్టీపై మోదీ
భారత సంతతి ప్రజలతో ప్రధాని సమావేశం

 
యాంగాన్‌: భారతదేశ ప్రయోజనాల్లో భాగమే నోట్లరద్దు, సర్జికల్‌ దాడులు, జీఎస్టీ నిర్ణయాలని ప్రధాని పేర్కొన్నారు. మయన్మార్‌లో భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి బుధవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘రాజకీయాలపై కంటే దేశమే ముఖ్యమని భావించడం వల్లే అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోగలుతున్నాం. సర్జికల్‌ దాడులు, నోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ఏ నిర్ణయమైనా ఎలాంటి భయం, సంకోచం లేకుండా తీసుకున్నాం’ అని చెప్పారు.  నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ.. ‘నల్లధనం, అవినీతి నిర్మూలనకు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆదాయపు పన్ను చెల్లించకుండా బ్యాంకుల్లో కోట్లు దాచుకున్న లక్షల మందిని గుర్తించగలిగాం.

మనీ ల్యాండరింగ్‌తో సంబంధమున్న రెండు లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ల్ని  రద్దు చేశాం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక నిజాయతీగా వ్యాపారం చేసే వాతావరణాన్ని కల్పించాం. సంస్కరణలే కాకుండా దేశ పరివర్తన కోసం కృషిచేస్తున్నాం. 2022 నాటికి నవభారతాన్ని నిర్మించడమే లక్ష్యం’ అని అన్నారు.  ‘అభివృద్ధి ఫలాల్ని పొరుగుదేశాలతో పంచుకోవాలని భారత్‌ విశ్వసిస్తుంది. కష్టసమయాల్లో సాయపడుతోంది. కొన్ని నెలల క్రితం సార్క్‌ దేశాల కోసం దక్షిణాసియా శాటిలైట్‌ను ప్రయోగించాం. నేపాల్‌ భూకంపం, మాల్దీవుల్లో తాగునీటి సమస్య, మయన్మార్‌ తుపాను సమయంలో భారత్‌ ముందుగా స్పందించింది’ అని చెప్పారు. ్ర

బిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలకు గుర్తుగా నేతాజీ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ(ఐఎన్‌ఏ) స్మారకాన్ని మయన్మార్‌లో ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. ‘మీ రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తా’ అని మయన్మార్‌లో నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ ఇచ్చిన పిలుపునకు వేలాది మంది స్పందించారని మోదీ గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు