'బాధగా ఉంది.. కానీ రాజీనామా చేయడం లేదు'

9 Sep, 2015 10:37 IST|Sakshi
'బాధగా ఉంది.. కానీ రాజీనామా చేయడం లేదు'

ముంబయి: తన బదిలీ చాలా బాధగా అనిపించిందని అయితే రాజీనామా చేసే ఆలోచనేది లేదని షీనా బోరా హత్య కేసును విచారించిన మాజీ ముంబయి పోలీస్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ మారియా అన్నారు. తన బదిలీ విషయంలో తాను రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. షీనా హత్య కేసును విచారిస్తున్న ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసి, డీజీపీ(హోంగార్డ్స్)గా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోకి డీజీపీ ర్యాంక్ అధికారి అహ్మద్ జావెద్ ముంబై నూతన పోలీసు కమిషనర్‌గా నియమించారు.

అయితే, ఈ నియామకం వెనుక రాజకీయ ప్రమేయం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పరోక్షంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు కూడా ఆయన నచ్చలేదని అందుకే ఆయనను వేరే శాఖకు బదిలీచేశారని కూడా విమర్శలు వినిపించాయి. ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో దిద్దుబాటుకు దిగి బదిలీతో సంబంధం లేకుండా ఈ కేసు దర్యాప్తును మారియానే పర్యవేక్షిస్తారని ప్రకటించింది. కానీ, బదిలీపై తీవ్ర ఆందోళనతో ఉన్న మారియా రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన బుధవారం ఈ వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు