నోట్లరద్దు అతిపెద్ద కుంభకోణం..ఫ్లాప్‌షో!

31 Aug, 2017 09:14 IST|Sakshi
నోట్లరద్దు అతిపెద్ద కుంభకోణం..ఫ్లాప్‌షో!

కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డ మమతాబెనర్జీ

సాక్షి, కోల్‌కతా: పెద్దనోట్ల రద్దు వివరాలతో ఆర్బీఐ వార్షిక నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోట్లరద్దు అతిపెద్ద కుంభకోణమని, ఫ్లాప్‌షో అని అభివర్ణించారు. నోట్లరద్దు ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుపై దేశ ప్రజలకు విశ్వాసముందని పేర్కొన్నారు.

' పెద్దనోట్ల రద్దుపై ఆర్బీఐ వెల్లడించిన వివరాలు పెద్ద కుంభకోణం జరిగిందనే సంకేతాలను ఇస్తున్నాయా? ఇది పూర్తిగా ఫ్లాప్‌షో. 99శాతం రద్దైన నోట్లు ఆర్బీఐకి తిరిగొచ్చాయి. కేవలం ఒక్కశాతం మాత్రమే తిరిగి రాలేదు' అని సీఎం మమత ఫేస్‌బుక్‌లోని తన పేజీలో పేర్కొన్నారు.

అవినీతి, నల్లధనంపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమైన నోట్ల రద్దు తదనంతర ఫలితాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) బుధవారం సాయంత్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99%  బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలిపింది. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్‌ కాలేదని వెల్లడించింది. అలాగే, రద్దు నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోనికి రాలేదని, 98.6% నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు