తాజాగా నూడుల్స్‌పై గోవా వేటు

8 Jun, 2015 03:25 IST|Sakshi
తాజాగా నూడుల్స్‌పై గోవా వేటు

* మెడికల్ షాపుల్లో పిల్లల ఆహార పదార్థాల అమ్మకాలపై నిషేధానికి యోచన
పణజి/న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం గోవా కూడా నిషేధం విధించింది. దీంతో మ్యాగీపై నిషేధం విధించిన రాష్ట్రాల సంఖ్య 11కు చేరింది. మరోవైపు ఇతర ఫాస్ట్‌ఫుడ్‌లపైనా దృష్టి సారించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. లెడ్ తదితర హానికర పదార్థాలు ఉంటే వాటిపైనా వేటు తప్పదన్న సంకేతాలిచ్చింది. ‘‘మ్యాగీ నూడుల్స్‌లో ప్రమాదకరమైన సీసం ఉన్నట్లు తేలింది. అందుకే నిషేధం విధించాం.

ఇది ఇంతటితో ముగియలేదు. హానికారకమని తేలితే ఇతర పదార్థాలపైనా నిషేధం తప్పదు. అలాంటి ఉత్పత్తులపై కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్రాలు ఓ కన్నేసి ఉంచాయి. అయితే ఇప్పటిదాకా అలాంటి ఆహార పదార్థాలు మా దృష్టికి రాలేదు’’ అని ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. అన్ని బ్రాండ్లకు సంబంధించిన నూడుల్స్‌ను పరీక్షిస్తామని భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టంచేసింది. మరోవైపు మందుల షాపుల్లో పిల్లల ఆహార పదార్థాల అమ్మకాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు.

‘‘మ్యాగీ విషయం చూశాం. సాధారణంగా మందుల దుకాణాల్లో పిల్లల కోసం కొనే పదార్థాలు మంచివనే నమ్మకముంది. అందువల్ల మందుల షాపుల్లో వివిధ రకాల ఔషధాలు, టానిక్‌లు తప్ప పిల్లల ఆహార పదార్థాలు అమ్మకపోవడమే మంచిదని భావిస్తున్నాం’’ అని చెప్పారు. కాగా, మ్యాగీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ప్రచారం నిర్వహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ) కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌లను కోరాయి. భారత్ నుంచి నెస్లే మ్యాగీ నూడుల్స్ దిగుమతులపై బహ్రెయిన్ తాత్కాలిక నిషేధం విధించింది.
 
ప్రచారం బారెడు.. నాణ్యత బెత్తెడు
నెస్లే కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారానికి భారత్‌లో కిందటేడాది ఏకంగా రూ.445 కోట్లు వెచ్చించింది. అదే ఉత్పత్తుల నాణ్యతా పరీక్షలకు మాత్రం అందులో 5 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. అందుకు కేవలం రూ.19 కోట్లు వెచ్చించి చేతులు దులుపుకుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ వార్షిక లెక్కలే చెబుతున్నాయి. గత ఐదేళ్లుగా ఆ కంపెనీ ఖర్చు ఇలాగే ఉంది. ప్రతి ఏటా ఉత్పత్తుల ప్రచారానికి రూ.300-450 కోట్ల మధ్య వెచ్చిస్తుండగా, నాణ్యత పరీక్షలకు రూ.12-20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తేలింది.

మరిన్ని వార్తలు