సీఎం గారూ.. మీరు చూపిన బాటలోనే

16 Sep, 2016 15:58 IST|Sakshi
సీఎం గారూ.. మీరు చూపిన బాటలోనే

యథా రాజా.. తథా అధికారగణం అన్నట్టుంది మధ్యప్రదేశ్లో వ్యవహారశైలి. ఇటీవల ఆ రాష్ట్రంలో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోకాళ్లలోతు నీళ్లలో తడవకుండా ఉండేందుకు భద్రత సిబ్బంది ఇద్దరు చేతులపై ఆయనను ఎత్తుకుని తీసుకెళ్లారు. ఈ ఫొటో మీడియాలో రావడంతో శివరాజ్పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీర్ ఒకరు సీఎం మాదిరిగా అదే పనిచేశారు.

పన్నా జిల్లాలోని ఓ గ్రామానికి అధికారులు వెళ్లారు. అధికారులు అక్కడి గ్రామస్తులకు మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిందిగా సూచించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. సబ్ ఇంజనీర్ అరవింద్ త్రిపాఠి చేసిన నిర్వాకం విమర్శలపాలైంది. గ్రామ పర్యటనలో ఆ ఇంజినీర్కు ఓ మురికికాలువ ఎదురైంది. ఆయనకు ఆ కాలువలో దిగి వెళ్లేందుకు ఇబ్బందిగా అనిపించింది. ఇంకేముంది ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు పాపం ఫ్యాంటును పైకి ముడుచుకుని ఇంజినీర్గారిని వీపుపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

గొప్ప పనిచేశానని భావించాడేమో కానీ ఆ ఇంజినీర్ ఈ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇంజినీర్ ఊహించనివిధంగా మీడియాలో వార్తలు రావడం, నెటిజెన్లు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. షూస్, ఫ్యాంటు తడిసిపోతాయని ఇంజినీరే తనకు సాయం చేయాల్సిందిగా ఓ యువకుడి కోరాడని గ్రామస్తులు చెప్పారు.


 

>
మరిన్ని వార్తలు