ఆజాద్ తుపాకీతో సెల్ఫీ తీసుకోవచ్చు

9 Aug, 2016 14:17 IST|Sakshi
ఆజాద్ తుపాకీతో సెల్ఫీ తీసుకోవచ్చు

స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉపయోగించిన పిస్టల్ తో సెల్ఫీ దిగేందుకు అలహాబాద్ మ్యూజియం అనుమతిచ్చింది. తనను ప్రాణాలతో పట్టుకోవాలని బ్రిటిషర్లు ప్రయత్నించగా.. ఆజాద్ తుపాకీతో తనని తాను కాల్చుకుని మరణించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూపీ సాంస్కృతిక సంక్షేమ శాఖ ప్రజలకు ఆజాద్ పిస్టల్ తో సెల్ఫీ తీసుకునేందుకు అనుమతినివ్వాలని మ్యూజియానికి సూచించింది.

కనీస ధరతో పిస్టల్ ను వీడియో తీసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలని పేర్కొంది. 1903 కోల్ట్ మోడల్ కు చెందిన ఈ పిస్టల్ ను పాకెట్ హ్యమర్ లెస్ సెమీ-ఆటో టెక్నాలజీతో తయారుచేశారు. 1931 ఫిబ్రవరి 27వ తేదిన బ్రిటిష్ పోలీసులతో ఆల్ఫ్రెడ్ పార్కులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆజాద్ ఈ తుపాకీతో తనని తాను కాల్చుకున్నారు.

ఆజాద్ గురించి నేటి యువతరానికి తెలియజెప్పడానికే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు మ్యూజియం డైరెక్టర్ చెప్పారు. పిస్టల్ తో సెల్ఫీ కోసం రూ. 50, వీడియోకు రూ.1,000 చార్జ్ చేయనున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీని అంత్యక్రియలకు తీసుకువెళ్లేప్పుడు ఉపయోగించిన వాహనంతో కూడా సెల్ఫీలు తీసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు