రూపీ పతనంతో ఎన్నారైల సంబరాలు

23 Aug, 2013 20:16 IST|Sakshi
రూపీ పతనంతో ఎన్నారైల సంబరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు ఏ ఇద్దరు ఎన్నారై స్నేహితులు కలిసినా ఒక్క విషయంపైనే చర్చించుకుంటున్నారు.‘‘ఏరా ఇంటికి ఎంత పంపావనే?’’. అది అమెరికాలోనైనా, బ్రిటన్, ఒమన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశమైనా వారి దృష్టంతా స్వదేశానికి సాధ్యమైనంత అధికంగా డబ్బు పంపుదామనే. దీనికంతటికీ కారణం రూపాయి విలువ అనూహ్యంగా క్షీణించడమే. ఎన్నడూ లేని విధంగా స్వల్ప కాలంలోనే డాలరుతో రూపాయి మారకం విలువ 15 శాతం క్షీణించడంతో ప్రవాస భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. 
 
 కేవలం డాలరుతోనే కాకుండా ఇతర దేశాల కరెన్సీలతో కూడా రూపాయి విలువ గణనీయంగా క్షీణించడంతో విదేశాల్లో నివసిస్తున్న 4 కోట్లమంది భారతీయులు స్వదేశానికి నగదు పంపేపనిలో ఉన్నారు. ముఖ్యంగా గత రెండు వారాల నుంచి ఎన్నారైలు పెద్ద మొత్తంలో ఇండియాకి నగదు పంపుతున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నెల రోజుల క్రితం రోజుకు రూ.125 కోట్లు పంపితే ఇప్పుడా మొత్తం రూ.250 కోట్లు దాటిందని ఫెడరల్ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వారం రోజులతో పోలిస్తే రెమిటెన్స్‌లు 20 శాతం పెరిగినట్లు హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. 
 
 అప్పు అయినా సరే...
 రూపాయి విలువ భారీగా క్షీణించడంతో ఇంతకాలం దాచుకున్న మొత్తాలను పంపడమే కాకుండా కొంతమంది మరో అడుగు ముందుకేసి అప్పులు తీసుకొని మరీ స్వదేశానికి పంపుతున్నారు. ఇప్పటికే రూపీ విలువ 15 శాతం క్షీణించడం, అలాగే డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రావడంతో ఖర్చులు పోను 22 శాతం వరకు స్థిరమైన రాబడి వస్తోందని, దీంతో అప్పులు తీసుకోవడానికి వెనుకాడటం లేదని ఎన్నారైలు చెపుతున్నారు. నెల క్రితం 1,000 బెహ్రెయిన్ దినార్లు పంపితే రూ.1.30 లక్షలు వచ్చేవని, ఇప్పుడా మొత్తం రూ.1.62 లక్షలు దాటడంతో అప్పు తీసుకొని మరీ రెండు వేల దినార్లు పంపినట్లు ఒక ప్రవాస భారతీయుడు పేర్కొన్నారు.
 
  2007లో డాలరు విలువ రూ.39గా ఉన్నప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం దాచుకున్న మొత్తాన్ని మొన్న రూ.58కి వచ్చినప్పుడు స్వదేశానికి పంపేశానని, కాని ఇప్పుడు ఆ విలువ రూ.65 దాటడంతో ఇంకొంత కాలం ఆగి ఉండాల్సిందని బాధపడుతున్నట్లు అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పేర్కొన్నాడు. రియల్టీలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాస భారతీయుల విచారణల్లో 35 శాతం వృద్ధి కనిపిస్తున్నట్లు అసోచామ్ తాజా సర్వేలో వెల్లడయ్యింది. అలాగే ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరికొంతమంది స్వదేశంలో తీసుకున్న గృహరుణాలు వంటివాటిని ముందుగానే చెల్లించే యోచనలో ఉన్నారు. 
 
 గల్ఫ్ దేశాల నుంచి...
 ప్రవాస భారతీయులు అత్యధికంగా ఉండే గల్ఫ్ దేశాల నుంచి ఈ మొత్తం మరింత అధికంగా ఉంది. గడచిన సంవత్సరం మొత్తం మీద యునెటైడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) నుంచి 8 బిలియన్ డాలర్లు ఇండియాకి వస్తే ఈ ఆరు నెలల్లో ఈ మొత్తం దాటినట్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్‌లు అందుకునే భారత్‌కు గత సంవత్సరం 70 బిలియన్ డాలర్లు వచ్చినట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో ఎన్నారైలు 549 కోట్ల డాలర్లు పంపినట్లు తెలుస్తోంది. దీంతో జూన్ నాటికి ఎన్నారై డిపాజిట్ల మొత్తం విలువ 7,107 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
 
 చాలా సంవత్సరాలుగా నేను ఒమన్‌లో పనిచేస్తున్నా.. ఎప్పుడూ లేని విధంగా నెల క్రితం రియాల్ మారకం ధర రూ.155 చేరినప్పుడు అప్పు చేసి మరీ స్వదేశానికి పంపాను. కాని ఇప్పుడు దీని విలువ రూ.165 దాటింది.. మళ్ళీ అప్పు చేసి పంపాలని ఉన్నా ధైర్యం సరిపోవడం లేదు.. మరికొంత కాలం వేచి చూస్తాను.
 - జి.రామకృష్ణ, మెకానికల్ ఇంజనీర్, ఒమన్.
 
 నేను ఇండియాలో హౌసింగ్ లోన్ తీసుకున్నా. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నా.. దీనికి సంబంధించిన ఈఎంఐని ప్రతి నెలా నేను డాలర్ల రూపంలో పంపుతున్నా. ఎప్పుడూ పంపే విధంగానే పంపుతున్నా.. రూపీ పతనం వలన ప్రతి నెలా నా రుణ భారం రూ.10,000 అదనంగాా తగ్గుతోంది. రూపీ మరింత క్షీణిస్తే మరిన్ని డాలర్లు పంపడం ద్వారా రుణాన్ని తొందరగా తీర్చే ఆలోచనలో ఉన్నా.
 -సీహెచ్.లక్ష్మీ నారాయణ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కాలిఫోర్నియా.
 
 పౌండ్ రూ.85 వద్ద ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి దాచుకున్న మొత్తాన్ని ఇండియాకు పంపాను. కాని ఇప్పుడు పౌండ్ రూ.100 దాటింది.. ఈ ప్రయోజనం పొందుదామంటే... చేతిలో చిల్లి గవ్వలేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. 
 - డాక్టర్ పి.శ్రీనివాస్, లండన్.
 
మరిన్ని వార్తలు