ఎన్‌ఎస్‌జీ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి

1 Jan, 2017 16:29 IST|Sakshi
ఎన్‌ఎస్‌జీ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి

న్యూఢిల్లీ: దేశమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి ఉండగా, నేరగాళ్లు భద్రతా సంస్థల వెబ్‌సైట్లను టార్గెట్‌ చేసుకున్నారు. దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్రవహిస్తోన్న నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ) అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్‌ఎస్‌జీ సైట్‌లోకి వెళ్లినవారికి సమాచారం స్థానంలో ఓ అభ్యంతరకర మెసేజ్‌ దర్శనమిచ్చింది. హ్యాకింగ్‌కు పాల్పడిన గ్రూప్‌ తనను తాను ‘అలోన్‌ ఇంజెక్టర్‌’గా పేర్కొంది.

కశ్మీర్‌లో ప్రభుత్వ, సైనిక హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అభ్యంతరకర రాతలు రాశారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందిచిన అధికారులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేపనిలో పడ్డారు. ఉగ్రదాడుల సమయంలో ప్రజలను కాపాడే బాధ్యతను తలకెత్తుకునే ఎన్‌ఎస్‌జీ కమాండోలు.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలకూ అనునిత్యం భద్రత కల్పిస్తూఉంటారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన సంస్థ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురికావడంతో హోంశాఖ వర్గాల్లో కలకలం రేగింది.

మరిన్ని వార్తలు