ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : సీఎం

19 Jan, 2016 03:51 IST|Sakshi
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : సీఎం

పేదల కోసం వినూత్న పథకాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని వెల్లడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దివంగత నందమూరి తారకరామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని  ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్‌టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఏ-కన్వెన్షన్ హాలులో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా దేశంలో మనల్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుందన్నారు. రూ.2కే కిలో బియ్యం, పేదలకు పక్కా భవనాలు, పేద విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, రైతులకు రూ.50కే విద్యుత్ వంటి వినూత్న పథకాలు ఇచ్చిన ఘనత ఎన్‌టీఆర్‌దేనన్నారు.

కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం వంటి సిద్ధాంతాలు చెప్పుకోవడానికే పనికొస్తున్నాయన్నారు. ఎన్‌టీఆర్ మాత్రం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ సిద్ధాంతాన్ని చెప్పి అమలు చేశారన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టమని తానూ అనుకున్నానని, 19 నెలల కాలంలో అన్నీ సాధ్యమేనని అర్థమైందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు సోమవారం నిర్వహించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు