అగ్ని-3 పరీక్ష మళ్లీ సక్సెస్

24 Dec, 2013 02:54 IST|Sakshi

బాలాసోర్(ఒడిశా): అణు సామర్థ్యం కలిగిన అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి సోమవారం నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలో విజయం సాధించింది. వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యం దీన్ని ఒడిశా తీరంలోని వీలర్ దీవి నుంచి ప్రయోగించింది. 3,000 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించింది. ప్రయోగంలో ఇది దాదాపు 350 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి... 3,000 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటూ భూ వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశించింది.

‘‘స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్(ఎస్‌ఎఫ్‌సీ) నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష.. మంచి ఫలితాలు వచ్చాయి. పరీక్షలో అన్ని పరామితుల విషయంలోనూ క్షిపణి పూర్తిస్థాయిలో విజయవంతమైంది’’ అని డీఆర్‌డీఓ ప్రతినిధి రవి కుమార్ గుప్తా తెలిపారు. అగ్ని-3కి సైన్యం వినియోగ పరీక్షలు నిర్వహించడం ఇది రెండోసారి. తాజా ప్రయోగం క్షిపణిని సైన్యంలో ప్రవేశపెట్టేందుకు వీలుగా నిర్వహించిన ముందస్తు పరీక్ష. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు సూచించిన మేరకు అన్ని ఆపరేషన్లను సైన్యం నిర్వహించింది. పరీక్షల్లో విజయం సాధించడంతో సైన్యంలో ప్రవేశపెట్టేందుకు ఈ క్షిపణి ఇప్పుడు అన్ని అర్హతలు సాధించినట్లయింది.

అగ్ని-3 ప్రత్యేకతలివీ..
*  ఇది రెండు దశల దృఢమైన ప్రొపెల్లెంట్ వ్యవస్థ కలిగి ఉంటుంది.
*  దీని పొడవు 17 మీటర్లు.. వ్యాసం 2 మీటర్లు.. బరువు దాదాపు 50 టన్నులు
*  1.5 టన్నుల బరువున్న అణ్వస్త్రాలను ఇది మోసుకుపోగలదు.
*  అధునాతన నావిగేషన్, గెడైన్స్, నియంత్రణ వ్యవస్థలు కలిగిన ఈ క్షిపణి కోసం అధునాతన కంప్యూటర్ వ్యవస్థను వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు