అగ్ని-5సక్సెస్

16 Sep, 2013 02:53 IST|Sakshi
అగ్ని-5సక్సెస్
బాలాసోర్ (ఒడిశా): భారత అమ్ముల పొది మరింత పదునెక్కింది. అణ్వస్త్ర సామర్థ్యం గల ‘అగ్ని-5’ దీర్ఘశ్రేణి ఉపరితల క్షిపణిని ఆదివారం రెండోసారి విజయవంతంగా పరీక్షించింది. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్లకు పైగా దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఒడిషా తీరంలోని వీలర్ దీవిలో గల పరీక్షా క్షేత్రం నుంచి ఆదివారం ఉదయం 8:50 గంటలకు అగ్ని-5 క్షిపణిని ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎలాంటి పొరపాట్లూ లేకుండా ఆశించిన ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అధికార ప్రతినిధి రవికుమార్‌గుప్తా ప్రకటించారు. 
 
 వేయి కిలోలకన్నా ఎక్కువ బరువుగల అణ్వాయుధాన్ని తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని తొలిసారి 2012 ఏప్రిల్ 19న విజయవంతంగా పరీక్షించారు. తాజాగా రక్షణ పరిశోధన శాస్త్రవేత్తలు, నిపుణుల సమక్షంలో క్షిపణిని రెండోసారి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. వీలర్ దీవిలోని లాంచ్ పాడ్ నుంచి క్షిపణిని ప్రయోగించగానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే భీకర గర్జనతో పొగలు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిందని ప్రత్యక్షంగా తిలకించిన వ్యక్తి ఒకరు తెలిపారు. దాదాపు 17 మీటర్ల నిడివి, రెండు మీటర్ల వెడల్పు గల క్షిపణి 50 టన్నుల బరువు ఉంటుంది. దేశీయంగా తయారుచేసిన ఇతర అగ్ని శ్రేణి క్షిపణులకన్నా ‘అగ్ని-5’ క్షిపణి మరింత ఆధునికమైనదని, ఆకాశయానం, దిశానిర్దేశం, వార్‌హెడ్, ఇంజన్‌లకు సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందులో పొందుపరిచామని శాస్త్రవేత్తలు వివరించారు. 
 
 ఇందులో ఉపయోగించిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనెర్షియల్ నావిగేషన్ సిస్టమ్, మైక్రో నావిగేషన్ సిస్టమ్‌లు.. ఖచ్చితమైన లక్ష్యానికి కొద్ది మీటర్ల దూరం వరకూ చేర్చాయని చెప్పారు. అగ్ని శ్రేణి క్షిపణుల్లో భారత్ వద్ద ప్రస్తుతం అగ్ని-1 (700 కి.మీ. లక్ష్య పరిధి), అగ్ని-2 (2,000 కిలోమీటర్ల లక్ష్య పరిధి), అగ్ని-3 (2,500 కిలోమీటర్ల లక్ష్య పరిధి), అగ్ని-4 (3,500 కిలోమీటర్ల లక్ష్య పరిధి) క్షిపణులు ఉన్నాయి. మరికొన్ని పరీక్షల తర్వాత ఐదు వేల కిలోమీటర్ల లక్ష్య పరిధి గల అగ్ని-5 క్షిపణిని కూడా సైన్యానికి అందిస్తామని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. ‘అగ్ని-5’ క్షిపణి విజయ వంత పరీక్షతో శాస్త్రవేత్తలు దేశం గర్వించేలా చేశారని రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని అభినందనలు తెలిపారు. ఇది భారత దీర్ఘశ్రేణి క్షిపణి శకంలో కొత్త మైలురాయి అని జాతీయ భద్రతా సలహాదారు శివ్‌శంకర్‌మీనన్ అభివర్ణించారు. దేశం గర్వించేలా చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ... ఆంటోనీకి అభినందనలు తెలిపారు. 
 
 అగ్ని-5 విశేషాలివీ..
  •  దేశీయ పరిజ్ఙానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి ఉపరితల క్షిపణి
  •  5,000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు
  •  1,000 కిలోలకు పైగా బరువుగల అణ్వస్త్రాన్ని తీసుకెళ్లగలదు
  •  పొడవు: 17 మీటర్లు, వెడల్పు: 2 మీటర్లు, బరువు: 50 టన్నులు
  •  మోటార్లు:  మూడు దశల సాలిడ్ రాకెట్ మోటార్లు 
మరిన్ని వార్తలు