బండబూతు తిట్టినా.. భేటీ!

9 Sep, 2016 07:37 IST|Sakshi
బండబూతు తిట్టినా.. భేటీ!

లావోస్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్‌ రోడ్రిగో డుటెర్టె బుధవారం అనధికారికంగా భేటీ అయ్యారు. ఆసియన్ సదస్సు గాలా విందు పూర్తయిన తర్వాత వీరు హోల్డింగ్‌ రూమ్‌లో కలిసి చర్చలు జరిపినట్టు ఫిలిఫినో అధికారులు తెలిపారు. నోటి దురుసుతనంతో ఒబామాను ఉద్దేశించి డుటెర్టె అవమానకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒబామా వెలయాలి కొడుకు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో డుటెర్టెతో మంగళవారం నాటి అధికారిక భేటీని ఒబామా రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే.

గతంలోనూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసి డుటెర్టె మీడియా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఒబామాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాలలో కొంత ఉద్రిక్తతను రేపాయి. ఈ నేపథ్యంలో డుటెర్టె తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఒబామాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఒబామ-డుటెర్టె అనధికారికంగా భేటీ అయి.. పలు అంశాలపై చర్చించారని, అమెరికా-ఫిలిప్పీన్స్‌ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని వారు ఈ భేటీలో గుర్తించారని, చారిత్రక ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించారని ఫిలిప్పీన్‌ విదేశాంగ కార్యదర్శి పెఫెక్టో యాసే తెలిపారు.

మరిన్ని వార్తలు