చైనాకు ఒబామా ఘాటు సూచన!

5 Sep, 2016 15:12 IST|Sakshi
చైనాకు ఒబామా ఘాటు సూచన!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చైనా ఆర్థిక విధానాల్లో తన దూకుడు వైఖరితో పొరుగుదేశాలను ఇబ్బంది పెడుతోంది. అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలోనూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ మొండిగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు బుద్ధిచెప్పే నాలుగు మాటలను అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చెప్పారు. అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చైనా తనను తాను నిగ్రహించుకొని సంయమనంతో వ్యవహరించాలని, అంతర్జాతీయ వేదికలపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఘాటుగా సూచించారు.

' అమెరికా అగ్రరాజ్యంగా ఎదుగడంలో తనను తాను నిగ్రహించుకోవడం కూడా ఉందనే విషయాన్ని (చైనా) అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్‌తో నేను మాట్లాడిన సందర్భంగా పేర్కొన్నాను' అని ఒబామా సీఎన్‌ఎన్‌ చానెల్‌తో చెప్పారు. 'అంతర్జాతీయ నియమనిబంధనలు రూపొందించుకున్నది.. వాటిని మనం కచ్చితంగా అనుసరించాలని కాదు. కానీ మనకు తెలుసు.. వాటిని అనుసరిచండం ద్వారా దీర్ఘకాలంలో బలమైన అంతర్జాతీయ పద్ధతిని మనం నిర్మించుకోగలం. ఇది మన ప్రయోజనాల కోసమే. ఇలా ఉండటం దీర్ఘకాలంలో చైనా ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా' అని ఒబామా చెప్పారు.

'దక్షిణా చైనా సముద్రం వంటి కొన్ని అంశాలలో అంతర్జాతీయ నియమనిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది. ఆర్థిక విధానాల విషయంలోనూ వారి(చైనా) ప్రవర్తన ఇదేవిధంగా ఉంది. ఈ విషయంలో మేం స్థిరంగా ఉన్నాం. ఇలా వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో పరిణామాలుంటాయని వారికి స్పష్టం చేశాం' అని ఒబామా చెప్పారు. 'వాణిజ్య విషయంలో అమెరికా, చైనా స్నేహపూర్వక పోటీదారులుగా ఉండకూడదని లేదు. రెండు దేశాలను వేధిస్తున్న అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కోవడంలో కీలక భాగస్వాములుగా రెండు దేశాలు కలిసి కొనసాగవచ్చు' అని ఒబామా చెప్పారు. అయితే, చైనా అంతర్జాతీయ నియమనిబంధనలకు లోబడి పనిచేస్తేనే.. ఆ దేశంతో భాగస్వామిగా కొనసాగేందుకు తాను సిద్ధమని అమెరికా చెప్తూ వస్తున్నదని ఒబామా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు