తృణమూల్, బీజేడీలదే హవా!

21 Jan, 2014 03:46 IST|Sakshi

న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల సమరంలో పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో అక్కడి అధికార పార్టీలు సత్తా చాటనున్నాయని లోక్‌నీతి-ఐబీఎన్ చానల్ సర్వే అంచనా వేసింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 20-28 స్థానాలను, ఒడిశాలో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ 10-16 స్థానాలను కైవసం చేసుకుంటాయని సోమవారం వెల్లడించిన సర్వే ఫలితాల్లో పేర్కొంది.  
 
 మోడీకే పట్టం
 చాలా రాష్ట్రాల్లో మాదిరే బెంగాల్, ఒడిశాల్లో ప్రధాని పదవి రేసులో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీ ముందుకు దూసుకుపోతున్నారు. సర్వే ఫలితాల ప్రకారం.. బెంగాల్లో ఆయనకు 18 శాతం మంది మద్దతు పలికారు. మమత ప్రధాని కావాలని 11 శాతం, రాహుల్ ఆ పదవి అధిష్టించాలని 9 శాతం మంది చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తామని కేవలం 10 శాతం మంది చెప్పారు. ఆ పార్టీకి రెండు శాతం ఓట్లు రావచ్చని సర్వే అంచనా. ఇక ఒడిశాలో.. మోడీ ప్రధాని కావాలని 33 శాతం, నవీన్ ప్రధాని కావాలని 12 శాతం మంది చెప్పారు. ఆ పదవి రాహుల్‌కు దక్కాలని 19 శాతం, ఆప్ నేత కేజ్రీవాల్‌కు దక్కాలని 1 శాతం మంది అన్నారు.

మరిన్ని వార్తలు