-

లైంగిక వేధింపులకు గురైన టీచర్ మృతి

1 Nov, 2013 15:11 IST|Sakshi

విశాఖ : ఒడిశాలోని రాయగడలో లైగింక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఉపాధ్యాయురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. రాయగడలో టీచర్గా పనిచేస్తున్న  ఇతిశ్రూ ప్రధాన్ (29) గత నెల 27న ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం  విశాఖ  సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించటంతో ఈ రోజు ఉదయం చనిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు  అధికారులపై వేటు పడింది.
 

 వివరాల్లోకి వెళితే..  పాఠశాల తనిఖీ అధికారి  దందసేన గత కొంతకాలంగా ఇతిశ్రూ ప్రధాన్ ను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది.  అంతకుముందు జూలై 16 వ తేదీన తాను పోలీసు స్టేషన్ లో దందసేనపై ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ  పోలీసులు అతనిపై చర్యలు తీసుకోలేదు. పోలీసుల నుంచి సానుకూల స్పందన లభించకపోవడంతో  ఆమె ఒడిషా మహిళా కమిషన్ ను,  జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది.
 

కలెక్టర్ ఎస్ బి. పాథీ దందసేనపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారికి ఆదేశించినా ఫలితం మాత్రం రాలేదు. అనంతరరం ఆమె తిరిగి పోలీస్ స్టేషన్ లో, పాఠశాల యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ చర్యలు చేపట్టకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసిన పాఠశాల తనిఖీ అధికారిపై, చర్యలు తీసుకోని విద్యాశాఖాధికారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కలెక్టర్ తెలిపారు.  ఈ ఘటనపై పూర్తి నివేదిక అందిన తరువాత వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
 

మరిన్ని వార్తలు