ఈ ఏడాది వృద్ధి 3.4 శాతమే

21 Nov, 2013 01:04 IST|Sakshi

లండన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2013-14)లో దేశ ఆర్థిక వ్యవస్థ 3.4% వృద్ధిని సాధించవచ్చునని ఓఈసీడీ అంచనా వేసింది. అయితే దేశ ఆర్థిక మంత్రి చిదంబరం 5-5.5% స్థాయిలో జీడీపీ వృద్ధి ఉంటుందని అంచనా వేశారు. దీంతో పోలిస్తే తాజా అంచనాలు బాగా తక్కువకాగా, గతేడాది(2012-13) 5% వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. ఇది దశాబ్ద కాలంలోనే అత్యంత కనిష్టంకాగా, ఇకపై ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటాయని ఓఈసీడీ అభిప్రాయపడింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ తగ్గడంతో ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు క్యాబినెట్ కమిటీ అనుమతుల నేపథ్యంలో పెట్టుబడులు వేగమందుకుంటాయని తెలిపింది. 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందని తెలిపింది. పారిస్‌కు చెందిన ఆర్థిక సహకారం, అభివృద్ధి సమితి(ఓఈసీడీ) బుధవారం ఈ అంచనాలను వెల్లడించింది. అయితే వచ్చే ఏడాది(2014-15)కి  జీడీపీ 5.7%వృద్ధిని సాధిస్తుందని అభిప్రాయపడింది. ఆపై ఏడాది(2015-16) 5.7% వృద్ధిని అందుకుంటుందని పేర్కొంది.
 
 రూపాయి ఎఫెక్ట్: దేశీ కరెన్సీ విలువ క్షీణించడంవల్ల ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణాలు, కార్పొరేట్ విదేశీ రుణాలు భార మవుతాయని తెలిపింది. సరఫరా సంబంధ సమస్యలు కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో కరెంట్ ఖాతా లోటు పెరిగి వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణానికే అధిక ప్రాధాన్యమిస్తూ ఇండియా అనుసరిస్తున్న పరపతి విధానాలు ఆహ్వానించతగ్గవని ప్రశంసించింది. భూ సేకరణ కొత్త చట్టం పెట్టుబడులకు ప్రోత్సాహకంగా నిలుస్తుందని, అయితే  కొత్త ఆహార చట్టం వ్యయభరితంగా పరిణమిస్తుందని వివరించింది.

>
మరిన్ని వార్తలు