బాల్య వివాహాన్ని ఆపాలని వెళితే..

28 Jun, 2017 23:07 IST|Sakshi

వేలూరు(తమిళనాడు): బాల్య వివాహాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులకు వింత అనుభవం ఎదురయింది. అధికారులు, పోలీసులు వస్తారని పసిగట్టిన పెళ్లివారు కళ్యాణ మండపాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. వివరాలివీ..

వేలూరు జిల్లా కాట్పాడి కయుంజూరుకు చెందిన క్రిష్ణమూర్తి కుమారుడు గణేష్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు సమీపంలోని కొత్తూరు గ్రామానికి చెందిన బాలిక(17)తో పెళ్లి నిశ్చయమయింది. కయుంజూరు రాధాక్రిష్ణ కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం పెళ్లి కుమార్తె తరఫు వారు కయుంజూరుకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా, బాలికకు వివాహం చేస్తున్నట్లు కాట్పాడి తహశీల్దార్‌ జగదీశన్‌కు బుధవారం వేకువ జామున 3 గంటలకు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి కళ్యాణ మండపానికి వెళ్లారు. అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న పెళ్లి వారు వధువు, వరుడు సహా అందరూ మండపాన్ని ఖాళీ చేసి పరారయ్యారు.

అధికారులు వెళ్లి మండపంలో ఎవరూ లేకపోవటంతో వంట తయారు చేస్తున్న వారిని విచారించారు. పెళ్లి వారంతా ఎక్కడికో వెళ్లిపోయారని వారు చెప్పినట్లు తెలిసింది. అయితే, వారంతా పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్లి ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కళ్యాణ మండపానికి రూ: 4 వేలు అడ్యాన్స్‌ ఇచ్చి ఉన్నారు. మండపంలో వంటకు ఉపయోగ పడే వస్తువులను పూర్తిగా అక్కడిక్కడే వదిలి వెళ్లడంతో ఎలాగైనా వారంతా తిరిగి వస్తారని అక్కడే పోలీసు కాపలా కాశారు. అయితే, వారు తిరిగి రాలేదు. అయితే, బాల్య వివాహానికి ప్రయత్నించిన పెళ్లి పెద్దలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం పెళ్లికని వచ్చిన వరుడి స్నేహితులు, బంధువులు మండపం బోసిపోయి ఉండటం చూసి అవాక్కయ్యారు

>
మరిన్ని వార్తలు