23 నుంచి అసెంబ్లీ సమావేశాలు

20 Sep, 2015 02:09 IST|Sakshi
23 నుంచి అసెంబ్లీ సమావేశాలు

- ఉభయ సభలూ ఉదయం 10కి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు లేఖల ద్వారా సమాచారం అందించారు. ‘శాసనసభ, మండలి మూడో సెషన్‌లో రెండో సమావేశాలు ఈ నెల 23న ఉదయం పది గంటలకు మొదలవుతాయి ..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించేదీ పేర్కొనలేదు.

ప్రభుత్వం ఈ సమావేశాలను కనీసం ఆరు రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 23, 24 తేదీల్లో సభ నిర్వహించి వరుసగా నాలుగు రోజుల పాటు (25, 26, 27, 28 తేదీల్లో) సెలవుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో నాలుగు రోజులు సభ జరిపే వీలుందని తెలుస్తోంది. పది రోజుల పాటు సభ  జరపాలన్న చర్చ కూడా జరిగిందని, ఇందులో కనీసం మూడు రోజుల పాటు రైతుల ఆత్మహత్యలు, రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై పూర్తిస్థాయి చర్చ జరపాలని కూడా అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరపాలన్న అంశంపై తొలి రోజున బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

>
మరిన్ని వార్తలు