కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిజమే!

16 Aug, 2015 01:13 IST|Sakshi

- పొడవు 1,170 మీటర్లు... గేట్ల సంఖ్య 194
- ప్రభుత్వానికి నిజనిర్ధారణ కమిటీ నివేదిక
- కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని
- అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం
- కేంద్రమంత్రి ఉమాభారతికి
- వివరించాలంటూ ఎంపీ జితేందర్‌కు ఫోన్
సాక్షి, హైదరాబాద్:
కృష్ణా నదిపై రాయచూర్ జిల్లాలో గిరిజాపూర్ గ్రామం వద్ద కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీ చేపట్టడం నిజమేనని పేర్కొంటూ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక అందగానే శనివారం సాగునీటి శాఖ మంత్రి మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

దీనిపై వెంటనే కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాలని ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషిని, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్‌ను మంత్రి ఆదేశించారు. సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, న్యాయ నిపుణులను సంప్రదించి ఫిర్యాదును తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత జితేందర్‌రెడ్డికి ఫోన్‌లో సూచించారు. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయడానికి చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
 
జూరాలకు వరద కష్టమే!
కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిర్మాణానికి సమాయత్తమవుతుందన్న సమాచారంపై మంత్రి హరీశ్‌రావు నిజ నిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారుల కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి ఫోటోలతో సహా నివేదికను సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌పీటీఎస్) నిర్మిస్తోంది. ‘‘బ్యారేజీ పొడవు 1,170 మీటర్లు. గేట్ల సంఖ్య-194. 24 నెలల కాల పరిమితితో రఘు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ ఏడాది జూలై 28న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

బ్యారేజీలో సుమారు రెండు టీఎంసీల నీరు నిలువ చేసే అవకాశం ఉంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రావడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది. దానికి తోడు నారాయణపూర్ నుంచి రావాల్సిన రీజనరేటెడ్ ఫ్లో కూడా రాకుండా పోతుందని తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దిగువ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలుపలేదు. కేంద్ర జల సంఘానికి, కేంద్ర విద్యుత్ అథారిటీకి అయినా తెలిపిందా, వారి నుంచి సూత్రప్రాయమైన అనుమతులైనా ఉన్నాయా అన్న విషయం తెలియరాలేదని కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ప్రొక్లైన్‌లు, టిప్పర్లు కనిపించాయని, పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు