హీరో సోదరికి గ్యాంగ్ స్టర్ ఝలక్..

19 Oct, 2015 12:26 IST|Sakshi
హీరో సోదరికి గ్యాంగ్ స్టర్ ఝలక్..

ముంబయి: అసలే అతడు పాత నేరస్తుడు. పైగా గ్యాంగ్ స్టర్. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు చేసిన నేరాల కారణంగా ముంబయి, థానే వంటి నగరాల్లో అడుగుపెట్టొద్దని పోలీసులు గట్టిగా హెచ్చరించి అతడిని బహిష్కరించారు. అలాంటి వ్యక్తిని నమ్మి టెస్ట్ డ్రైవింగ్ కారు ఇస్తే చేతివాటం చూపించకుండా ఊరుకుంటాడా. సరిగ్గా ముంబయిలో అదే జరిగింది. గ్యాంగ్ స్టర్ అఫ్తాబ్ పటేల్ బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ కారును టెస్టు డ్రైవింగ్ కోసం తీసుకెళ్లి పరారయ్యాడు.

ఈ ఘటన చోటుచేసుకుని వారం రోజులు గడిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే సాహిల్ ఖాన్ సోదరి షయిస్టా తమ మెర్సిడీస్ కారును ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్మకానికి పెట్టదలుచుకున్నారు. అ క్రమంలోనే దాని వివరాలు ఫొటోలతో సహా ఆన్ లైన్ లో ఈ నెల 7న పెట్టింది. ఈ ప్రకటన చూసిన పటేల్.. సాహిల్ సోదరికి అక్టోబర్ 8న ఫోన్ చేశాడు. అదే రోజు అక్టోబర్ 8న కాందివ్లీ అనే గ్రామం వద్ద సాయంత్రం కలుసుకున్నాడు. తాను రూ.42 లక్షలు చెల్లించి కారును సొంతం చేసుకుంటానని, అంతకంటే ముందు టెస్ట్ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

మరో రోజు ఉదయం 8 గంటలకు పజీరో జీపు(ఎంహెచ్-03-ఏఎం-5832) లో మరికొందరు స్నేహితులతో కలిసి వచ్చాడు. అనంతరం డీల్ కుదుర్చుకుని సాహిల్ కారు డ్రైవర్ అర్షాద్ అన్సారీ చేతిలో రూ.50 వేలు పెట్టాడు. టెస్టు డ్రైవింగ్కు వెళ్లొచ్చాడు. మిగితా డబ్బు చెల్లించాక కారు తీసుకెళ్తానని చెప్పాడు. అయితే, తన ఖాతాలో మిగితా డబ్బు చెల్లించాలని షయిస్టా చెప్పింది. అలాగే, అని మరో రోజు ఉదయం ఏకంగా ఆమె ఇంటికి ఓ స్నేహితుడితో కలిసి వెళ్లి మరోసారి టెస్ట్ డ్రైవింగ్ కోసం అడిగాడు. అలా రెండోసారి టెస్ట్ డ్రైవింగ్ కోసం కారును తీసుకెళ్లిన పటేల్ ఇక తిరిగి ముఖం చూపించలేదు. ఈ విషయం చివరికి షయిస్టా తన సోదరుడికి చెప్పడంతో అతడు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడికోసం పోలీసులు గాలింపులు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు