కార్గిల్ యుద్ధానికి 16 ఏళ్లు

26 Jul, 2015 10:20 IST|Sakshi
కార్గిల్ యుద్ధానికి 16 ఏళ్లు

న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకొనే 'విజయ దివస్' సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 'మాతృభూమి కోసం పోరాడి, యుద్ధంలో మరణించిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. త్రివిధ దళాల శౌర్యానికి, త్యాగానికి ప్రతీక విజయ్ దివస్' అని ట్వీట్ చేశారు.

రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పమాల ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. కె. ధోవన్ లు కూడా పాల్గొన్నారు. కార్గిల్ జిల్లాలోని ద్రాస్ వార్ మెమోరియల్ వద్ద శనివారం నాడు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు.

కార్గిల్ యుద్ధం ముగిసి నేటికి  16 ఏళ్లు. 1999 మే నెలలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై 26 వరకు కొనసాగింది. కశ్మీర్ లోని కార్గిల్ జిల్లా సహా సరిహద్దు వెంబడి మరికొన్నచోట్ల జరిగింది. యుద్ధప్రారంభ దశలో ఇది కేవలం కశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న ఆందోళనగా భావించినప్పటికీ మరణించిన భారత జవాన్ల దగ్గర లభించిన ఆధారాలను బట్టి ఇందులో పాకిస్థాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువైంది. పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూర్చాయి. దీంతో మన దేశం అప్పమత్తమైంది.

వాస్తవాధీనరేఖ దాటి పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగిన దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో ఇది రెండోది. మొదటిది  చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది. కార్గిల్ యుద్ధంలో దాదాపు 500 మంది భారత జవాన్లు, అధికారులు అమరులయ్యారు.

>
మరిన్ని వార్తలు