తెలుగు ప్రజలకు మరోసారి ద్రోహం

10 Dec, 2015 05:33 IST|Sakshi
తెలుగు ప్రజలకు మరోసారి ద్రోహం

సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలకు రాష్ట్ర విభజన తరువాత మరోసారి ద్రోహం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పూర్తిగా భంగకరమని పేర్కొన్నారు.

కేంద్రం సమర్పించిన అఫిడవిట్ గురించి ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీకి తెలియదంటే నమ్మశక్యంగా లేదన్నారు. టీడీపీ నేతలను సంప్రదించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావించలేమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం చేసిన ఈ అన్యాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్‌గజపతి రాజు కూడా నోరు మెదపలేదని శ్రీకాంత్‌రెడ్డి తప్పు పట్టారు.

వీరంతా తమ స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లుగా ఉందని మండిపడ్డారు. 2011లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడినప్పు డే మనకు అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. దిగువ రాష్ట్రాలకు మిగులు జలాలను వాడుకునే పూర్తి హక్కు ఉన్నా దానికోసం చంద్రబాబు పోరాడటం లేదన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను ఆయన దాదాపుగా వదులుకున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉండటమే రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సమీక్షించాలని డిమాండ్ చేశారు.  
 
జగన్ ముందడుగు
తాము అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపుల రద్దుతోపాటు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క మద్యం షాపు మాత్రమే ఉండేలా చేస్తామని, ధరలు షాక్ కొట్టేలా నిర్ణయిస్తామని వైఎస్ జగన్ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. విజయవాడలో కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించడంతో ఆయన ప్రస్తుతం ఓ అడుగు ముందుకేసి సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు