ఉగ్రవాదుల దాడిలో సీఐఎస్ఎఫ్ జవాను మృతి

23 Sep, 2013 11:50 IST|Sakshi

జమ్ము కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్లో సోమవారం జరిగిన గెరిల్లా దాడిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్ఎఫ్) చెందిన ఓ జవాను మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్ నగరంలోని నాజ్ సినిమా థియేటర్ సమీపంలో ఉన్న సీఐఎస్ఎఫ్ బలగాలపై వేర్పాటువాద గెరిల్లాలు సోమవారం ఉదయం కాల్పులు జరిపారు. గాయపడ్డ జవాన్లలో ఒకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో జవానుకు మాత్రం తీవ్రంగా బుల్లెట్ గాయాలయ్యాయన్నారు.

కాల్పులు జరగడంతో దుకాణదారులు, పాదచారులు భయంతో పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు, పారా మిలటరీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు నాజ్ థియేటర్ సమీపంలో కూరగాయలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. కాశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమాలు మొదలుకావడంతో 1990 నుంచే నాజ్ థియేటర్ను మూసేశారు.

మరిన్ని వార్తలు