అరవై నిమిషాలకో అతివ ఆహుతి

2 Sep, 2013 03:08 IST|Sakshi
అరవై నిమిషాలకో అతివ ఆహుతి
  • దేశంలో వరకట్న సంబంధిత కారణాలతో...
  • 2007 నుంచి క్రమంగా పెరుగుతున్న వరకట్న చావులు
  • కట్నం కోరలకు 2012లో 8,233 మంది మహిళలు బలి
  • నేర నిర్ధారణ మాత్రం 32 శాతమే
  • జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల్లో వెల్లడి
  •  న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ, ముంబైలో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం వంటి ఘటనలు ఓవైపు సాగుతుండగా, మరోవైపు వరకట్న జ్వాలల్లోనూ అతివలు ఆహుతి అవుతున్నారు. వరకట్న సంబంధిత కారణాలతో దేశంలో ప్రతి గంటకూ ఓ మహిళ బలి అవుతున్నట్టు తాజాగా వెల్లడైంది. 2007, 2011 మధ్య కాలంలో ఈ తరహా మరణాలు క్రమంగా పెరిగినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎస్‌సీఆర్‌బీ) గణాంకాలు పేర్కొన్నాయి. 2012లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 8,233 మంది మహిళలు వరకట్న కోరల్లో చిక్కుకుని మృతిచెందినట్టు అవి వెల్లడించాయి. అంటే ప్రతి అరవై నిమిషాలకూ ఓ మహిళ మరణించినట్టు లెక్క. 2011లో ఈ తరహా మరణాలు 8,618 చోటుచేసుకోగా, నేరనిర్ధారణ రేటు 35.8 శాతం మాత్రమే నమోదైంది. 2012లో ఇది 32 శాతానికి తగ్గడం గమనార్హం. వరకట్న సంబంధిత చావులు 2007, 2011 మధ్య కాలంలో క్రమంగా పెరిగాయి. 2007లో 8,093 మరణాలు చోటుచేసుకోగా, 2008లో 8,172, 2009లో 8,383 మరణాలు సంభవించాయి.
     
     2010లో అవి 8,391గా నమోదయ్యాయి. వరకట్న సమస్య అనేది కేవలం పేద లేదా మధ్యతరగతి వర్గాలకే పరిమితం కాలేదని, ఉన్నతస్థాయి కుటుంబాల్లో సైతం ఈ జాడ్యం ఉందని ఢిల్లీ అదనపు డీసీపీ (మహిళలు, శిశు ప్రత్యేక విభాగం) సుమన్ నల్వా పేర్కొన్నారు. ‘‘సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల్లో కూడా వరకట్న దురాచారం కొనసాగుతోంది. ఉన్నత చదువులు చదువుకున్నవారు కూడా కట్నం వద్దని చెప్పడంలేదు. ఈ దురాచారం మన సామాజిక వ్యవస్థలో లోతుగా పాతుకుపోయింది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘వరకట్న నిషేధ చట్టం, 1961 ప్రకారం.. కట్నం అడగడం, ఇవ్వడం, అంగీకరించడం నేరం. కానీ వివాహ సమయంలో కట్నం అనేది తప్పనిసరి బహుమతి కింద పరిగణిస్తున్నారు.
     
     ప్రస్తుతం ఉన్న చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. వాటిని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. 1983లో వరకట్న చట్టానికి సవరణలు చేసినా, ఆశించిన ఫలితాలు ఇప్పటికీ అందుకోలేకపోయాం’’ అని నల్వా వివరించారు. అయితే, ఇలాంటి కేసుల్లో ప్రాథమిక దర్యాప్తును పోలీసు శాఖ సరిగా చేయడంలేదని, ఫలితంగా న్యాయ ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కామిని జైశ్వాల్ అభిప్రాయపడ్డారు. వరకట్న సంబంధిత కేసులను త్వరితగతిన విచారణ జరిపి దోషులకు శిక్ష విధించాలని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు