ఉల్లి దోసెకు విరామం

28 Aug, 2015 08:32 IST|Sakshi
ఉల్లి దోసెకు విరామం

* గుంటూరు, కృష్ణా జిల్లాల హోటళ్ల యజమానుల నిర్ణయం
* ధర దిగొచ్చే వరకూ ఇదే పరిస్థితి
* బెంబేలెత్తిస్తోన్న ఉల్లి


సాక్షి, విజయవాడ బ్యూరో : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల నుంచి ఉల్లి దోసె దొరకడం గగనమైంది. ఉల్లి దోసె, సమోసాల విక్రయాలకు పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల యజమానులు తాత్కాలిక విరామం పలికారు. ‘సారీ సార్... ఉల్లి దోసె వేయడం లేదు’ అని సమాధానమిస్తున్నారు. మార్కెట్లో ఉల్లి ధర చుక్కలనంట డమే దీనికి కారణం.

ధర దిగొచ్చే వరకూ ఉల్లి దోసె కష్టమేనని బదులిస్తున్నారు. దీంతో ఉల్లిదోసె ప్రియులకు కష్టమొచ్చి పడినట్లయ్యింది. వీరు నోరు కట్టేసుకుని ఇడ్లీ, సాదా దోసెలతో సరిపుచ్చుకుంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోని హోటళ్లలో రోజుకు సగటున 20 క్వింటాళ్ల ఉల్లిపాయల వాడకం ఉంటుందని అంచనా. గుంటూరు నగరంలో ఉల్లితో తయారు చేసే తినుబండారాల ద్వారా రోజుకు రూ. 30 లక్షల నుంచి 35 లక్షల వ్యాపారం ఉంటుందని సీనియర్ హోటల్ వ్యాపారి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయల ధర కిలో రూ.65 నుంచి రూ.70 వరకూ పలుకుతోంది.

ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా రూ.20 లకే సరఫరా చేస్తున్నా, అవన్నీ గృహ అవసరాలకే సరిపోవడం లేదు. ఇక హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు ఎక్కడ దొరుకుతాయని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అధిక ధర పెట్టి ఉల్లిపాయలు కొని ఉల్లి దోసెను అందుబాటులో ఉంచాలంటే ప్రస్తుతం ఉన్న దోసె రేటును రెట్టింపు చేయాల్సి ఉంటుందనీ, ఆ విధంగా రేటు పెంచితే కస్టమర్లు రారని, దీంతో వాటికివిరామం ఇచ్చామని చెబుతున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు