ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఢమాల్

9 Aug, 2016 08:59 IST|Sakshi
ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఢమాల్

న్యూఢిల్లీ : ఒకప్పుడు ఆన్లైన్ లో స్మార్ట్ ఫోన్ల కొనుగోలకు ఎగబడిన వినియోగదారులు 2016 ప్రథమార్థంలో మాత్రం ఆ ఊపును తగ్గించారు. ఆన్లైన్లో స్మార్ట్పోన్ కొనుగోలపై ఆసక్తి తగ్గించారు. దీంతో ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఢమాల్ మనిపించాయి. మార్చిలో ఈ-కామర్స్ సంస్థల ఆఫర్ చేసే డిస్కౌంట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినతరమైన నిబంధనలే ఈ అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారకంగా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. 2016 జూన్ తో ముగిసిన ఆరు నెలల కాలంలో ఆన్ లైన్లో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 32 శాతానికి కుప్పకూలినట్టు తెలిపింది. ఆన్లైన్తో పోలిస్తే ఆఫ్లైన్ అమ్మకాలు బాగున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ నవ్కేందర్ సింగ్ తెలిపారు. అయితే ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లపై మాత్రం స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో స్ట్రాంగ్గానే ఉన్నాయని కౌంటర్ పాయింట్ తెలిపింది.  

కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఆన్లైన్ స్మార్ట్ఫోన్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారకంగా నిలిచే డిస్కౌంట్ల ఆఫర్లకు ప్రభుత్వం కళ్లెంవేయడంతో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు క్షీణించాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆన్ లైన్లో వస్తువుల కొనుగోలుకు సౌకర్యవంతం, ప్రత్యేకధర, డిస్కౌంట్ లే ప్రధాన కారకాలుగా నిలుస్తాయని లీఎకో స్మార్ట్ ఫోన్ల బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతుల్ జైన్ చెప్పారు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో భారీ డిస్కౌంట్లకు చెక్ పడిందన్నారు.

వినియోగదారుల ప్రవర్తనకు అనుగుణంగా ఆఫ్లైన్, ఆన్లైన్లో నిర్ణయించే స్మార్ట్ఫోన్ ధరల్లో మార్పులు ఉంటుందని చైనీస్ స్మార్ట్ఫోన్ షియోమి ఇండియా హెడ్ మనూ జైన్ తెలిపారు. ఇండియాలో షియోమి మొదట ఆన్లైన్ బ్రాండుగా అరంగేట్రం చేసింది. తర్వాత ఆఫ్లైన్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది.  జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం ఫోన్ల అమ్మకాల్లో ఆన్లైన్ అమ్మకాలు 33 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా కొత్త మొబైళ్ల ఆవిష్కరణలు కూడా మూడేళ్ల కాలంలో మొదటిసారి నీరసించాయి. 2016 సగం ఏడాది కాలంలో ఈ ఆవిష్కరణలు 29 శాతం క్షీణించాయి. ముందటి రెండేళ్లలో కొత్త ఫోన్ల లాంచింగ్ యేటికేటికీ 32 శాతం పెరుగుదల నమోదైంది.

>
మరిన్ని వార్తలు