కేరళ సీఎం కారుపై దాడి

28 Oct, 2013 02:04 IST|Sakshi
కేరళ సీఎం కారుపై దాడి

కన్నూర్ (కేరళ): కేరళలోని సోలార్ ప్యానెల్ కుంభకోణానికి వ్యతిరేకంగా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఆదివారం చేపట్టిన నిరసనలు హింసాకాండకు దారితీశాయి. ఎల్డీఎఫ్ కార్యకర్తల రాళ్ల దాడిలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి గాయాలయ్యాయి. కన్నూర్‌లోని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చాందీ పోలీసు మైదానం వద్దకు వస్తుండగా, ఈ సంఘటన జరిగింది. భారీ బలగాలను మోహరించినా, నిరసన కొనసాగిస్తున్న ఎల్డీఎఫ్ కార్యకర్తలు సభా వేదిక వైపు దూసుకొచ్చి, మైదానంలోకి వస్తున్న చాందీ కారుపై రాళ్ల దాడికి దిగారు. రాళ్ల తాకిడికి కారు అద్దాలు పగిలి, చాందీకి కుడి కంటికి ఎగువన నుదుటిపై స్వల్ప గాయాలయ్యాయి. చాందీపై రాళ్ల దాడిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. సీపీఎం అప్రజాస్వామిక వైఖరిని అవలంబిస్తోందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని దుయ్యబట్టాయి.
 
 

తనపై దాడి జరిగినా, చాందీ వెనక్కి మళ్లకుండా, పోలీసు మైదానంలో ఏర్పాటైన కేరళ పోలీసు క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, కేరళ హోంమంత్రి తిరువాంచూర్ రాధాకృష్ణన్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సంఘటనా స్థలం వద్దనే ఉన్న డీజీపీ కె.ఎస్.బాలసుబ్రమణ్యన్‌ను ఆదేశించారు. మరోవైపు, చాందీపై దాడికి వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లోనూ నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న చాందీ మాట్లాడుతూ, ఇలాంటి హింసాకాండతో కాంగ్రెస్‌ను ఎవరూ బలహీనపరచలేరని అన్నారు. కన్నూర్ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు తరచు దాడులను ఎదుర్కొంటున్నారని, వారి ఇక్కట్లతో పోలిస్తే, తనపై జరిగిన దాడి చిన్నదేనన్నారు.
 

మరిన్ని వార్తలు