భరించే అభ్యర్థి ఎవరు..?

4 Aug, 2015 03:32 IST|Sakshi
భరించే అభ్యర్థి ఎవరు..?

* ఓరుగల్లు ఉపఎన్నికపై టీపీసీసీ మల్లగుల్లాలు
* కాసులు పెట్టే అభ్యర్థికోసం అన్వేషణ
* ఖర్చుకోసం వెనుకాడుతున్న నేతలు
* వ్యూహాత్మకంగా తెరపైకి మీరాకుమార్


సాక్షి, హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు టీపీసీసీకి ‘భారం’గా మారాయి. అధికారపార్టీ సిట్టింగ్ స్థానంలో పోటీ పడాలంటే అంగబలం, అర్థబలం దండిగా ఉన్న అభ్యర్థినే బరిలో నిలపాలి. అలాంటి అభ్యర్థి అయితేనే ఖర్చు భారం తమపై పడదని టీపీసీసీ భావిస్తోంది.   

ఇక్కడ గెలవాలంటే అర్థబలం కీలకమని, దీనికి తట్టుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థిని కాకుండా, పదేళ్లపాటు ప్రభుత్వ పదవుల్లో కొనసాగిన వారిని వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిపితేనే టీపీసీసీ నేతలపై భారం పడకుండా తప్పించుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా వ్యవహరించిన నేతలు సైతం వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాసక్తతతో ఉండడం పార్టీని కలవరపరుస్తోంది.

ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం వల్ల టీఆర్‌ఎస్‌కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని, ఖర్చుకు కూడా వెనకాడే పరిస్థితి ఉండదని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలంటే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరును తెరపైకి తీసుకువస్తున్నారని ఆ పార్టీ నాయకుడొకరు పేర్కొంటున్నారు. మీరాకుమార్‌కు పార్టీ టికెట్ ఇస్తే వరంగల్‌లో ఉప ఎన్నిక ఖర్చు అంతా ఏఐసీసీ భరిస్తుందనే ఆలోచనలతోనే వ్యూహాత్మకంగా ఈ పేరును ప్రచారంలోకి తెచ్చినట్టుగా చెబుతున్నారు.
 
దామోదరపై పెరుగుతున్న ఒత్తిడి
టీఆర్‌ఎస్‌కు పోటీగా ఖర్చు పెట్టుకోవడంతో పాటు తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటీలో దిగాలంటూ కొందరు నేతలు కోరుతున్నారు. ఆయన బరిలో ఉంటే తెలంగాణవాదుల నుంచి మద్దతును పొందడం సులభం అవుతుందని వారు వాదిస్తున్నారు. తెలంగాణ 10 జిల్లాలకు రాయలసీమ జిల్లాలను కలిపే ప్రతిపాదనను వ్యతిరేకించిన చరిత్ర దామోదరకు ఉందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలుచేయడంలోనూ కీలకంగా పనిచేశారని, ఇది ఆయనకు ఉప ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీలు జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య వంటిపేర్లపై అధిష్టానం సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు