చంద్రబాబు, దేవాన్ష్‌ తాగేది ఆ పాలే

3 Jun, 2017 07:20 IST|Sakshi
చంద్రబాబు, దేవాన్ష్‌ తాగేది ఆ పాలే

- హెరిటేజ్‌ పాలలో కల్తీకి తావులేదు: బ్రాహ్మణి
- తమిళనాడు మంత్రి సంచలన ఆరోపణలకు కౌంటర్‌


చెన్నై:
ప్రైవేట్‌ డైరీలను ఉద్దేశించి తమిళనాడు పాలు మరియు డైరీ ఉత్పత్తుల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన సంచలన ఆరోపణలపై హెరిటేజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి స్పందించారు. హెరిటేజ్‌ పాలలో కల్తీకి తావులేదని, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నందునే తమ సంస్థ పాతికేళ్లుగా మనగలుగుతోందని ఆమె చెప్పారు. చెన్నైలో గురువారం జరిగిన కార్యక్రమంలో "హెరిటేజ్‌ పెట్‌ బాటిల్‌" ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదలచేసిన బ్రాహ్మణి.. మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.

పాల సేకరణ కోసం తుప్పుపట్టని క్యాన్లను వాడుతున్నామని, సేకరించిన పాలను 150 సెంటర్లలో ప్రాసెసింగ్‌ చేస్తున్నామని, హెరిటేజ్‌ పాలలో కల్తీకి తావే లేదని బ్రాహ్మణి స్పష్టం చేశారు. తన రెండేళ్ల కుమారుడు దేవాన్ష్‌, తన మామ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం హెరిటేజ్ పాలనే తాగుతారని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో తన మామ(చంద్రబాబు) పాదయాత్ర చేసిన సందర్భంలో హెరిటేజ్ పాలను తాగి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారని బ్రాహ్మణి వివరించారు. వచ్చే ఐదేళ్లలో హెరిటేజ్‌ టర్నోవర్‌ను రూ.6వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అవి పాలు కాదు విషం: రాజేంద్ర
పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ప్రైవేట్‌ డైరీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని తమిళనాడు పాలు మరియు డైరీ ఉత్పత్తుల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ ఆరోపించారు. ప్రైవేట్‌ సంస్థలు పాలలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, క్లోరిన్‌ లాంటి రసాయనాలను కలుపుతున్నాయని, తమ బృందాలు చేసిన అధ్యయనంలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. గతవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. "ప్రైవేట్‌ డైరీలు తయారుచేసేవి పాలే కాదు.. విషం" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై పలు డైరీ సంస్థలు మండిపడ్డాయి.

మరిన్ని వార్తలు