పోతూ కూడా ఇండియాకు వార్నింగ్‌ !

29 Nov, 2016 15:35 IST|Sakshi
పోతూ కూడా ఇండియాకు వార్నింగ్‌ !

పాక్‌ ఆర్మీ చీఫ్‌ రహీల్‌ షరీఫ్‌ నోటిదురుసు..

దిగిపోతున్న పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రహీల్‌ షరీఫ్‌ మంగళవారం భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. కశ్మీర్‌ ఉద్రికత్తల విషయంలో తాము సంయమనంగా వ్యవహరించడాన్ని బలహీనతగా భావించవద్దని, అలా భావిస్తే ప్రమాదకరమైన పొరపాటేనని ఆయన అన్నారు. పదవీ నుంచి దిగిపోతున్న రహీల్‌ షరీఫ్‌ తన వారసుడైన కొత్త ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాను ఆహ్వానిస్తూ రావాల్పిండి ఆర్మీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

‘దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఆక్రమిత కశ్మీర్‌లో ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం పెరిగిపోయింది. భారత్‌ దురాక్రమణపూరిత చర్యలకు దిగుతుండటంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయి’ అని షరీఫ్‌ అన్నారు. ‘మా సంయమనాన్ని బలహీనతగా భావిస్తే.. అది భారత్‌కు ప్రమాదకరమేనని నేను ఆ దేశానికి స్పష్టం చేయదలిచాను’ అని పేర్కొన్నారు. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం అణ్వాయుధ దేశాలైన భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించడం, అనంతరం సరిహద్దుల్లో వరుస కాల్పులతో ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు