లిబ‌ర్టీ త‌ల‌న‌రికేసిన ట్రంప్ !

5 Feb, 2017 13:11 IST|Sakshi
లిబ‌ర్టీ త‌ల‌న‌రికేసిన ట్రంప్ !

బెర్లిన్‌: ‘అధికారం చేపట్టిన ఏడు రోజులలోపే ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విధించి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ శాంతికి శనిలా మారాడు.. స్వేచ్ఛకు సంకెళ్లేస్తున్నాడు.. తన కంపు నోటితో భూగోళాన్ని మింగేస్తున్నాడు..’ అంటూ  ప్రఖ్యాత జర్మన్‌ వార్తా పత్రిక డెర్ స్పీగెల్‌.. అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ మ్యాగజీన్‌లోని రాతల సంగతి సరేగానీ, కవర్‌పేజీపై ముద్రించిన ట్రంప్‌ కార్టూన్‌పై మాత్రం తీవ్రస్థాయి దుమారం చెలరేగుతున్నది.

పేరులోనే ‘స్వేచ్ఛ’ను కలిగిన అమెరికా విశిష్ఠత‌ను చాటిచెప్పే ‘స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ’(లిబర్టీ విగ్రహం) త‌ల‌ను ట్రంప్ న‌రికేసిన‌ట్లుగా ఆ కార్టూన్ ఉంది. ఎడెల్ రోడ్రిగ్జ్ అనే కార్టూనిస్టు వేసిన ఈ బొమ్మపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ‘ట్రంప్‌ను విమర్శించాలనే ఉద్దేశం మంచిదే అయినా, లిబర్టీ తలను నరికేయడం మాత్రం సరికాదు’అని సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యురోపియ‌న్ యూనియ‌న్(ఈయూ) కూడా సదరు కార్టూన్‌ను ఖండించింది. అయితే ఆ కార్టూన్‌ గీసిన ఎడెల్‌ మాత్రం తాను గీసింది సరైనే బొమ్మేనని వాదిస్తున్నారు.

గ‌తంలో న్యూయార్క్ డైయిలీ న్యూస్ కూడా ట్రంప్‌-లిబర్టీ కార్టూన్‌ను ప్రచురించింది. కాక‌పోతే ర‌క్త‌పాతం తక్కువ‌గా చూపించారు. తాజా కార్టూన్‌ను ముద్రించింది జర్మన్‌ పత్రిక కావడంతో ఇప్పుడీ అంశం వివాదాస్పదమైంది. శరణార్థుల విషయంలో జర్మనీ తప్పు చేసిందని ట్రంప్‌ పలు మార్లు తిట్టిపోయడం, ప్రతిగా యురోపియన్‌ యూనియన్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ కార్టూన్‌ ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి..
(ట్రంప్‌ను అడ్డుకోకుంటే మనం మటాషే!)

 

మరిన్ని వార్తలు