మూడు లక్షల మంది మరణించారు

24 Dec, 2016 13:30 IST|Sakshi
మూడు లక్షల మంది మరణించారు
సిరియా యుద్ధం ప్రారంభమై దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో ఆ దేశంలోని కీలక భాగాలు నాశనమయ్యాయి. యుద్ధంలో ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది మరణించగా.. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా శరణార్ధులుగా పొరుగు దేశాలకు వెళ్లిపోయారు.
 
భారీగా మరణాలు
2011 మార్చిలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నినాదాల నుంచి ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ గత వారం పేర్కొంది. వీరిలో 90 వేల మందికి పైగా పౌరులు ఉన్నట్లు తెలిపింది. యుద్ధానికి ముందు 23 మిలియన్లు జనాభా కలిగిన సిరియాలో యుద్ధం కారణంగా 6.6 మిలియన్ల జనాభా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పింది. 
 
శరణార్ధులు
యుద్ధం కారణంగా 48 లక్షల మంది ప్రజలు సిరియాను వదిలి వెళ్లిపోయారని యూనైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(యూహెచ్ సీఆర్) పేర్కొంది. వీరిలో 27 లక్షల మంది పైగా టర్కీకి వలస వెళ్లారని చెప్పింది. టర్కీ తర్వాత లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టులు శరణార్ధులకు ఆశ్రయం కల్పించాయి. అయితే, పెద్ద సంఖ్యలో శరణార్ధులు యూరప్ చేరుకోవడానికి సముద్రమార్గాన్ని ఎంచుకుని ప్రాణాలు కోల్పోయారు. యూరప్ చేరుకున్న కొంతమంది శరణార్ధులను అక్కడ అధికారులు జైళ్లలో బంధించి చిత్రవధ చేశారు. దాదాపు 17,700 మంది యూరప్ జైళ్లలో మరణించగా, వేల మంది జీహాదిస్టుల చెరలో ప్రాణాలు వదిలారని యూహెచ్ సీఆర్ చెప్పింది. 
 
నాశమైన ఆర్ధిక వ్యవస్ధ
సిరియా యుద్ధం కారణంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మూడు దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలకు గండి పడగా.. వసతులు, ఆరోగ్య, విద్యావ్యవస్ధలు సమూలంగా నాశనమయ్యాయి. సిరియా మొత్తం(కొన్ని ప్రాంతాల మినహా) విద్యుత్తు సౌకర్యం లేకుండా జీవనం సాగిస్తోందని ఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 2015లో చెప్పింది. 80శాతం జనాభా పేదరికంలో బతుకీడుస్తున్నారు. 2010 నుంచి 2015 మధ్యలో 55శాతం మేర సిరియా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది.
మరిన్ని వార్తలు