దేశీ ఖర్చు.. విదేశీ టూరు

22 Dec, 2013 01:22 IST|Sakshi
దేశీ ఖర్చు.. విదేశీ టూరు
  •  సెలవుల సీజన్లో విహారాల జోరు
  •  రెండుమూడు రోజులకు విదేశీ ప్యాకేజీలు
  •  స్థానిక టూర్ల బదులుగా వీటికే ఓటేస్తున్న తీరు
  •  ఏ టూరుకైనా ప్రయాణ బీమా ఉండాల్సిందే!
  • ఇది సెలవుల సీజన్. క్రిస్‌మస్, న్యూ ఇయర్, ఆ వెంటే సంక్రాంతి అన్నీ వరసగా వచ్చేస్తున్నాయి. మరి సెలవులకు ఎక్కడికెళ్లాలి? సెలవులంటే మరీ ఎక్కువ రోజులేమీ ఉండవు కదా! ఈ చోటా బ్రేక్ ఎక్కడ తీసుకోవాలి?  కాకపోతే సెలవుల కాన్సెప్ట్ ఇపుడు మారింది. 3-4 రోజులు దొరికితే... ఎంచక్కా విదేశాలకు చెక్కేసే ట్రెండ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ఎయిర్‌లైన్ సంస్థలూ డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. వీటి వివరాలే... ఈ వారం కథనం...
     
    ఇంతకుముందు సెలవులొచ్చాయంటే... కుటుంబాలకు సరదాగా గడపడానికి మొదట గుర్తుకొచ్చేవి ఊటీ, కేరళే. యువతీయువకులకైతే గోవా. కాకపోతే ఆదాయాలు గణనీయంగా పెరగటం, బడ్జెట్ ఎయిర్‌లైన్స్ రావటంతో... ఇపుడు అదే ఖర్చుతో థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాలు చుట్టివచ్చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విమానంలో కేరళ, గోవాలకు వెళ్లి రెండ్రోజులు ఉండాలంటే కనీసం రూ. 20 నుంచి రూ. 30 వేలదాకా ఖర్చవుతోంది. అదే ఖర్చుతో ఇప్పుడు బ్యాంకాక్‌లో నాలుగు రోజులు ఉండి వచ్చే వీలుండటంతో... రెండు మూడు రోజులు సెలవులు దొరికితే చాలు... విదేశాలను చుట్టి వచ్చేసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది.
     
     ధర పెరిగితే... టూర్ తగ్గుతుంది
     డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణతతో విదేశీయానం కొద్దిగా భారమైనా విదేశాలకు వెళ్లడానికి యువత ఏ మాత్రం వెనకాడటం లేదు. అవసరమైతే రోజుల సంఖ్యను తగ్గించుకుంటామే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోబోమని వారు చెబుతున్నట్లు యాత్రా డాట్ కామ్ తన సర్వేలో పేర్కొంది. రూపాయి కోలుకునే దాకా ఆగే పరిస్థితి లేదని, గతంలో వారం రోజులు గడిపితే ఇప్పుడు నాలుగైదు రోజులు మాత్రమే విదేశాల్లో ఉంటామని వారు చెబుతున్నారు. అంతేకాదు! పెరిగిన భారాన్ని భర్తీ చేసుకోవడానికి ఫైవ్‌స్టార్ హోటల్‌కు బదులు త్రీస్టార్, బడ్జెట్ హోటల్స్‌లో దిగడం, షాపింగ్‌ను సాధ్యమైనంతవరకు తగ్గించడం వంటి పొదుపు చర్యలు చేపడుతున్నట్లు యాత్రా డాట్ కామ్ పేర్కొంది.
     
     ప్రత్యేక చోటా ప్యాకేజీలు...
     విదేశాలకు వెళ్లే టూరిస్టుల కోసం ఇపుడు రెండు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీలను కూడా ట్రావెల్ సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఎక్స్‌పీడియా అయితే రెండు రాత్రులు, మూడు రోజుల దుబాయ్ పర్యటనకు రూ. 28,000 నుంచే ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అలాగే మేక్ మై ట్రిప్, యాత్రా డాట్ కామ్ వంటి ట్రావెల్‌సైట్స్ విమాన టిక్కెట్లతోపాటు, హోటల్ బుకింగ్స్ చేసుకుంటే 30 నుంచి 40 శాతందాకా డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా రెండు మూడు నెలలు ముందుగా బుక్ చేసుకునే టికెట్స్‌పై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నాయి.
     
     ప్రయాణ బీమా అవసరమా?
     అసలు విదేశాలకు విమాన ప్రయాణాలు చేసేటపుడు ప్రయాణ బీమా అవసరమా? ఇది చాలామందికి కలిగే సందేహం. నిజానికి బీమా మనకు రిస్క్ లేకుండా చేసేది. విదేశీ పర్యటనల్లో రిస్క్ ఎక్కువ కాబట్టి... అక్కడ అనారోగ్యం తలెత్తినా, సామగ్రి పోయినా మనను ఆదుకునేది బీమానే కాబట్టి ఇది తప్పనిసరి. బీమా కంపెనీలిపుడు విదేశీ పర్యటనలకే కాకుండా దేశీయ పర్యటనలకూ బీమా రక్షణ కల్పిస్తున్నాయి. ఈ పాలసీలు చాలా తక్కువ ప్రీమియానికే అనేక ప్రయోజనాలనందిస్తాయి. విమానం ఆలస్యం కావటం నుంచి... మెడికల్, దొంగతనం వంటి అనేక అంశాలకు బీమా ఉంటుంది. ప్రయాణించే రోజులు, దేశాన్ని బట్టి ప్రీమియం మారుతుంది. సాధారణంగా వారం రోజుల పర్యటనకు రూ.500 నుంచి రూ.700 వరకు ప్రీమియం వసూలు చేస్తారు.
     
     కవరేజీ దేనికి ఉంటుందంటే...
     చికిత్స వ్యయం:  కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. లేదా ప్రమాదం సంభవించి ఆసుపత్రిపాలు కావచ్చు. విదేశాల్లో చికిత్స మనం భరించే స్థాయిలో ఉండదు. అదే  బీమా ఉంటే ఈ వ్యయాన్ని కంపెనీయే భరిస్తుంది.
     
     సామాన్లు పోతే: ప్రయాణంలో అప్పుడప్పుడు సామాన్లు పోగొట్టుకోవడం జరుగుతుంది. లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు బ్యాగేజీ మారిపోవడం వంటివి కూడా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో బ్యాగేజీ సరైన సమయానికి రాక కొత్త డ్రెస్సులు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీ అక్కరకు వస్తుంది.
     
     పర్యటన రద్దయితే...: దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని రిజర్వేషన్లు, హోటల్ గదులు వంటివి ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. ప్రతికూల వాతావరణం ఉంటే విమాన సర్వీసులు రద్దు, ప్రయాణం నిలిచిపోవడం లేదా కొంత ఆలస్యం కావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ముందుగా చేసుకున్న రిజర్వేషన్లను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నష్టాన్ని బీమా కంపెనీయే భరిస్తుంది.
     
     ఆలస్యమయితే...: ఇటీవల విమానాలు, రైళ్లు షెడ్యూలు టైమ్ కన్నా ఆలస్యం కావడమనేది సాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాల్లో కూడా బీమా కంపెనీలు నష్టపరిహారాన్ని చెల్లిస్తాయి. విమానం అయిదారు గంటలు మించి ఆలస్యమైతే బీమా కంపెనీలు నష్టపరిహారం ఇస్తున్నాయి.
     
     వీసాపోతే...: విదేశాల్లో వీసా పోతే తిరిగి ఇండియా రావడానికి ఉండదు. అప్పటికప్పుడు మళ్లీ వీసా తీసుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఇలాం టి సమయాల్లో కూడా ట్రావెల్ బీమా ఉపయోగపడుతుంది. అలాగే ఏమైనా విలువైన వస్తువులు పోగొట్టుకుంటే వాటికి కూడా బీమా రక్షణను పొందవచ్చు.


      - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
     

మరిన్ని వార్తలు