వీడియోకాన్ ‘మొజాంబిక్’ డీల్

8 Jan, 2014 01:19 IST|Sakshi
వీడియోకాన్ ‘మొజాంబిక్’ డీల్

న్యూఢిల్లీ: మొజాంబిక్‌లోని భారీ గ్యాస్ క్షేత్రంలో వీడియాకాన్ గ్రూప్‌నకు ఉన్న 10% వాటా... ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్) చేతికొచ్చింది. ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్(ఓవీఎల్), ఓఐఎల్‌లు సంయుక్తంగా ఈ వాటాను కొనుగోలు చేయడంద్వారా డీల్ ప్రక్రియ పూర్తయింది. ఇందుకోసం ఇరు కంపెనీలు కలిసి మంగళవారం 2.475 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.15,300 కోట్లు)ను వీడియోకాన్‌కు చెల్లించిన ట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రొవూమా ఏరియా-1 అనే పేరుతో పిలిచే ఈ మెగా గ్యాస్ బ్లాక్‌లో మరో 10 శాతం వాటాను ఓవీఎల్ 2.64 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
 
 అమెరికా ఇంధన దిగ్గజం అనడార్కో పెట్రోలియం నుంచి ఓవీఎల్ ఈ వాటాను చేజిక్కించుకుంది. దీనికి సబంధించిన చెల్లింపులను ఫిబ్రవరి చివరికల్లా పూర్తి చేసే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఈ గ్యాస్ బ్లాక్‌లో కనీసం 35 ట్రిలియన్ ఘనపు టడుగులు(టీసీఎఫ్-ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు), గరిష్టంగా 65 టీసీఎల్‌ల గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. రిలయన్స్ కేజీ-డీ6లో నిక్షేపాలతో పోలిస్తే మొజాంబిక్ బ్లాక్‌లో 13 రెట్ల అధిక నిల్వలు ఉన్నట్లు లెక్క. కాగా, వీడియోకాన్ తన 10 శాతం వాటా కోసం 2.8 బిలియన్ డాలర్ల మొత్తాన్ని డిమాండ్ చేసిందని... అయితే, సంప్రతింపుల ద్వారా ఈ మొత్తాన్ని 2.475 బిలియన్ డాలర్లకు తగ్గించగలిగామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే బ్లాక్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)కు చెందిన అనుబంధ సంస్థకు ఇప్పటికే 10 శాతం వాటా ఉండటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు