‘పాకిస్థాన్‌ ఆ పని చేయదు’

5 Jun, 2017 18:33 IST|Sakshi
‘పాకిస్థాన్‌ ఆ పని చేయదు’

న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలనుకుంటున్న పాకిస్థాన్‌.. కశ్మీర్‌ వివాదాన్ని అంతర్జాతీయ న్యాస్థానం(ఐసీజే) దృష్టికి తీసకెళ్లనున్నట్లు వార్తలు వినవస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌  కీలక ప్రకటన చేశారు.

‘ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కశ్మీర్‌ సమస్య పరిష్కారం అవుతుందన్న భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు. పాకిస్థాన్‌ సైతం ఈ విషయంలో ఐసీజేకి వెళ్లదని భావిస్తున్నాం’ అని సుష్మ వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కశ్మీర్‌ వివాదంతోపాటు తమ(విదేశాంగ) శాఖకు సంబంధించిన పలు విషయాలను ఆమె వెల్లడించారు.

‘పాకిస్థాన్‌తో ఎల్లప్పుడూ స్నేహాన్నే కోరుకుంటాం. కానీ.. విధ్వంసం, శాంతి ఒకే గొడుగుకింద మనలేవు. ఒక వైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు చర్చలంటే సాధ్యమయ్యేపనికాదు. పాక్‌ తన ద్వంద్వవైఖరి వీడితే చర్చలకు భారత్‌ సిద్ధమే’ అని సుష్మా స్వరాజ్‌ అన్నారు. ఎన్నారైలు గతంలో కంటే ఇప్పుడు మాతృదేశంతో బాధవ్యాన్ని కొనసాగించగలుగుతున్నారని, గడిచిన మూడేళ్లలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 37.5 శాతం పెరిగిందని, సంక్షుభిత దేశాల్లో చిక్కుకుపోయిన 80 వేల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని  సుష్మా చెప్పారు. విదేశాంగ శాఖ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంలో తనకు సహకారం అందించిన ప్రధాని మోదీ, సహాయ మంత్రులు వీకే సింగ్‌, ఎంజే అక్బర్‌లకు సుష్మా ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు