పాకిస్థాన్‌ ప్రధాని ఉంటారా? ఊడుతారా?

20 Apr, 2017 10:31 IST|Sakshi
పాకిస్థాన్‌ ప్రధాని ఉంటారా? ఊడుతారా?

న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన పనామా పత్రాల కేసులో పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు గురువారం తన తీర్పు వెలువరించనుంది. అక్రమ మనీలాండరింగ్‌ ద్వారా విదేశాల్లో ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుటుంబసభ్యులు ఆస్తులు కూడబెట్టారంటూ పనామా పత్రాల్లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జగరనున్న నేపథ్యంలో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు షరీఫ్‌, ఆయన పార్టీ పీఎంఎల్‌-ఎన్‌కు కీలకం కానుంది.

అధికార దుర్వినియోగానికి పాల్పడిన 67 ఏళ్ల షరీఫ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్ష నేత, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 1990లో రెండుసార్లుల ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో షరీఫ్‌ అక్రమ మనీలాండరింగ్‌ ద్వారా లండన్‌లో ఆస్తులు పోగేశారని, ఇదే విషయంలో పనామాపత్రాల్లో సైతం వెలుగుచూసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తిరస్కరించలేని ఆధారాలు ఉన్నందున ప్రధాని షరీఫ్‌పై సుప్రీంకోర్టు వేటు వేయడం అనివార్యమని ఇమ్రాన్‌ ఖాన్‌ భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు