పాక్‌ సంబరం.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది!

20 Jun, 2017 17:44 IST|Sakshi
పాక్‌ సంబరం.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది!

కరాచీ: ‘నాన్న.. నన్ను కాల్చేశారు’... ఇది 15 ఏళ్ల బాలుడి చివరి ఆర్తనాదం. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ జట్టు విజయం సాధించడంతో ఆ దేశంలో సంబరాలు వెర్రిపుంతలు తొక్కాయి. పాక్‌ గెలుపును పురస్కరించుకొని కరాచీలో రోడ్లమీదకు వచ్చిన జనాలు గాలిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 ఏళ్ల బాలుడికి తూటా దూసుకెళ్లింది.

గత ఆదివారం చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. సంబరాలు వెల్లువెత్తాయి. కానీ, 15 ఏళ్ల సయెద్‌ హుస్సైన్‌ రజా జైదీ ఇంట్లో మాత్రం విషాదఛాయలు నెలకొన్నాయి. పాక్‌ గెలుపు సంబరాల్లో భాగంగా కరాచీలో గాలిలో కాల్పులు జరపడంతో ఇంటి పెద్ద కొడుకైన హుస్సైన్‌ జైదీ శరీరంలోకి తూటా దూసుకెళ్లింది. ‘నాన్న.. నన్ను కాల్చేశారు’ అంటూ హుస్సైన్‌ నేలకూలాడు.

కరాచీలోని జిన్నా పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సెంటర్‌కు వెంటనే తరలించినా లాభం లేకపోయింది. హుస్సైన్‌ ప్రాణాలు విడిచాడు. హుస్సైన్‌ ఘటన ఒక్కటే కాదు. సంబరాల్లో భాగంగా గాలిలో జరిపిన కాల్పుల కారణంగా ఎంతోమంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఒక్క కరాచీలో డజనుకుపైగా మంది గాలిలో కాల్పుల వల్ల గాయాలపాలయ్యారు. విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో ఖైబర్‌ ఫఖ్తున్‌ఖ్వాలో పలువురికి గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు