పాక్లో ఉధృతమైన యుద్ధం

17 Oct, 2016 13:11 IST|Sakshi
పాక్లో ఉధృతమైన యుద్ధం

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో ప్రభుత్వానికి మీడియాకు మధ్య నడుస్తోన్న యుద్ధం మరింత ఉధృతమైంది. పాక్ ప్రభుత్వ, భద్రతా బలగాల గొంతుకగా నిలిచిన 'ది నేషన్' పత్రిక సోమవారం నాటి సంపాదకీయంలో షరీఫ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 'అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అవుతున్నా మనకు కించిత్ బాధలేదు' అంటూ విమర్శలు చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు ప్రతిగా పాకిస్థాన్ ను భారత్ ఏం చేయాలనుకుంటుందో.. ఆ(అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఏకాకిని చేసే)పనిని సమర్థవంతంగా చేస్తున్నదని, దానిని అడ్డుకోవడంలో పాక్ అడుగడుగునా విఫలమవుతున్నదని 'ది నేషన్' వ్యాఖ్యానించింది.

'ఉడీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పట్ల ధృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్న భారత్.. కొద్ది గంటల కిందట గోవాలో ముగిసిన బ్రిక్స్ సదస్సులోనూ 'పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తల్లిలా పెంచిపోషిస్తోంది' అని విమర్శించింది. అంతకు ముందు సార్క్ సమావేశాన్ని బహిష్కరించింది. దక్షిణ ఆసియాలోని మరో ఏడు దేశాలు కూడా భారత్ ను సమర్థిస్తూ పాకిస్థాన్ కు దూరమయ్యాయి. అవకాశం లభించిన అన్ని సందర్భాలనూ వినియోగించుకుంటున్న భారత్.. పాక్ ను ఏకాకిని చేసే పనిని విజయవంతంగా చేస్తోంది. ఈ తరుణంలో మనం(పాకిస్థాన్) విధానాలను మార్చుకోవాలి' అని 'ది నేషన్' పేర్కొంది. కొద్ది రొజుల కిందట డాన్ పత్రికలో ప్రచురితమైన వ్యాసం దేశభద్రతకు విఘాతం కల్గించిందన్న పాక్ ప్రభుత్వం.. ఆ పత్రిక రిపోర్టర్ సిరిల్ అల్మైదాను దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసినం సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన వారంలోపే ఇప్పుడు 'ది నేషన్' కూడా అదే బాటలో ప్రభుత్వం, భద్రతా సంస్థలపై తీవ్రస్థాయి ఆరోపణలకు దిగడం గమనార్హం.

పాక్ కోర్టులు, దర్యాప్తు సంస్థలే పేర్కొన్నట్లు జైష్ ఏ, జమాతుల్ దవా, లష్కరే తాయిబా వంటి ఉగ్రవాద సంస్థల పీచమణచాలని, ఉడీ, పఠాన్ కోట్ దాడుల సూత్రధారి మసూద్ అజార్, ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ లను వెంటనే నిర్బంధించి తద్వారా ప్రపంచానికి మన సత్తా చూపాలని పాక్ ప్రభుత్వానికి 'ది నేషన్' సూచనలు చేసింది. తన, పర బేధాలు చూడకుండా ఉగ్రవాదులందరిపైనా ఉక్కుపాదం మోపితేగాని పాక్ ను ప్రపంచదేశాలు నమ్మలేవని 'ది నేషన్' అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు