పాకిస్తాన్‌కు దిమ్మతిరిగింది

18 May, 2017 19:27 IST|Sakshi
పాకిస్తాన్‌కు దిమ్మతిరిగింది

ఇస్లామాబాద్‌: కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్టే విధించడంతో పాకిస్తాన్‌కు షాక్‌ తగిలినట్టైందని ఆ దేశ మీడియా పేర్కొంది. ఐసీజే నిర్ణయం పాకిస్థాన్‌కు దిగ్భ్రాంతి, అసంతృప్తి కలిగించిందని ‘డాన్‌’  పత్రిక వెల్లడించింది. జాధవ్‌కు విధించిన మరణశిక్షపై స్టే విధించే అధికారం ఐసీజేకు లేదని పాకిస్తాన్‌ విశ్లేషకులు పేర్కొన్నట్టు తెలిపింది. పాక్‌ న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించలేకపోయారని పేర్కొన్నారు.

ఐసీజే ముందు హాజరయి తమ దేశం తప్పుచేసిందని, విచారణకు హాజరుకాకుండా ఉండాల్సిందని రిటైర్డ్ జస్టిస్‌ షాయిఖ్‌ ఉస్మానీ అభిప్రాయపడ్డారు. స్టే కొనసాగినంత కాలం జాధవ్‌కు మరణశిక్ష అమలు చేయడానికి వీలులేదన్నారు. వాదనలకు ఇచ్చిన 90 నిమిషాల సమయాన్ని పాకిస్తాన్ లాయర్లు వినియోగించుకోలేకపోయారని లండన్‌కు చెందిన న్యాయవాది అస్లాం రషీద్‌ పేర్కొన్నారు. తక్కువ సమయంలో వాదనలు ముగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసును సరిగా ప్రజెంట్‌ చేయలేకపోయారని, బలమైన వాదనలు వినిపించలేకపోయారని విమర్శించారు.

ఐసీజే నిర్ణయానికి చట్టబద్దంగా కట్టుబడాల్సిన అవసరం లేదని, నైతికంగా మాత్రమే అమలు చేయాల్సివుంటుందని విశ్లేషకుడు జాహిద్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు విఘాతం కలిగించేలా ఐసీజే నిర్ణయం ఉందని మాజీ అటార్నీ జనరల్‌ ఇర్ఫాన్‌ ఖాదిర్‌ అన్నారు. ఐసీజే నిర్ణయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని న్యాయవాది ఎ. నసీమ్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు