పాలమూరు ప్రతిభ

27 Feb, 2017 02:56 IST|Sakshi
పాలమూరు ప్రతిభ

వినికిడి యంత్రాన్ని రూపొందించిన లక్ష్మి
మార్చి 3న రాష్ట్రపతి భవన్‌లో సైన్స్‌ ప్రదర్శనకు పిలుపు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని నిరూపించింది మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మన్‌గండ్లకు చెందిన పేద విద్యార్థిని లక్ష్మి.. వినికిడి యంత్రాన్ని రూపొందించి అందరిచేత భళా అనిపించుకుంది. మార్చిలో ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే సైన్స్‌ ఇన్‌ స్పైర్‌ ప్రదర్శనకు హాజరుకావాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు అందుకుంది. రంగారెడ్డి జిల్లా మహ్మదాబాద్‌కు చెందిన బాలమణికి ఇద్దరు కూతుళ్లు. లక్ష్మి మొదటి సంతానం. తండ్రి లక్ష్మయ్య చనిపోవడంతో ఆమె కూలీ పనులు చేస్తూ కుమార్తెలను చదివిస్తోంది.

లక్ష్మి నవాబ్‌పేట మండలం ఎన్మన్‌గండ్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌  ఫస్టియర్‌ చదువుతోంది. ఎన్మన్‌ గండ్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుండగా  గతేడాది వినికిడి యంత్రాన్ని తయారుచేసి నాగర్‌కర్నూల్‌లో జరిగిన సైన్స్‌ప్రదర్శనలో ప్రదర్శించగా రెండోస్థానం దక్కింది. గత డిసెంబర్‌ 10, 11వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ   వైజ్ఞానిక ప్రదర్శనలో ఇది ఉత్తమప్రదర్శనగా ఎంపి కైంది. కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ చేతు ల మీదుగా అవార్డును అందుకుంది. దీంతో  మార్చి 3న రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు రావాలని పిలుపు అందింది.  ఆర్థిక ఇబ్బందులతో బాధపడు తున్న లక్ష్మి  ఢిల్లీకి వెళ్లేందుకు ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తోంది. సాయం చేసే వారు టీచర్‌ శ్రీధర్‌ 9490140477 నంబర్‌కు సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు