ప్రధాని పదవి కోల్పోయిన నవాజ్‌ షరీఫ్‌

28 Jul, 2017 12:47 IST|Sakshi
ప్రధాని పదవి కోల్పోయిన నవాజ్‌ షరీఫ్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. షరీఫ్తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్న పనామా గేట్‌ కుంభకోణం కేసులో ఈమేరకు తుది తీర్పు ప్రకటించింది. ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం జిట్‌ జూలై 10న సమర్పించిన నివేదిక ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం నవాజ్‌ షరీఫ్‌ను దోషిగా తేల్చింది. షరీఫ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిలు ... తక్షణమే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

 1990ల్లో షరీఫ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్‌లో భారీగా ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలపై జిట్‌ విచారణ చేపట్టింది. గతేడాది విడుదలైన పనామా పత్రాల్లో నవాజ్‌ షరీఫ్‌ పేరు రావడంతో... ఆస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షరీఫ్‌ పిల్లల పేరిట ఉన్న డొల్లకంపెనీల ద్వారా నగదును దేశం దాటించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.

సుప్రీంకోర్టులో నవాజ్‌ షరీఫ్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో  ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం  కొత్త ప్రధాని ఎంపికపై మంత్రివర్గంతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తాను పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే సోదరుడిని పాక్‌ ప్రధానిని చేసేందుకు నవాజ్‌ షరీఫ్‌ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు, పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎం షెహబాజ్‌ షరీఫ్‌తో పాటు రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ కూడా రేసులో ఉన్నారు.