ఆర్‌అండ్‌బీకి పంచాయతీరాజ్ రోడ్లు

28 Sep, 2015 02:36 IST|Sakshi
ఆర్‌అండ్‌బీకి పంచాయతీరాజ్ రోడ్లు

- అప్పగించేందుకు ప్రభుత్వ అంగీకారం
- తొలుత 33 రోడ్ల అప్పగింత  
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన రహదారుల పనులు చేపట్టిన రోడ్లు భవనాల శాఖ తాజాగా పంచాయతీరాజ్ రోడ్లపై కన్నేసింది. హైవేలతో సరైన అనుసంధానం లేని మండల కేంద్రాలకు సంబంధించిన రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ అధీనంలో ఉన్న ఇలాంటి రోడ్ల ను ఇకనుంచి తానే నిర్వహిస్తానని ముందుకొచ్చింది. అందుకు ప్రభుత్వమూ అంగీకరించింది. ఈ క్రమంలో తొలుత 33 రోడ్లను ఆ శాఖకు అప్పగించనుంది. సోమవారం జరిగే ఓ సమావేశంలో దీనికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
 
 మారుమూల ప్రాంతాల్లో ఉన్న మండల కేంద్రాలను సమీపంలోని హైవేలకు రెండు వరసల రోడ్లతో అనుసంధానించనుంది. ఈ తరహా రోడ్ల నిర్మాణానికి నిధుల అవసరం ఎక్కువగా ఉండటం, ప్రత్యేక నిర్మాణ పద్ధతులను అవలంభించాల్సి ఉన్నందున అది పంచాయతీరాజ్ శాఖకు కష్టంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అలాంటి అన్ని రోడ్లను దశలవారీగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించబోతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని నగరానికి రెండు వరసలతో అనుసంధాన రోడ్ల నిర్మాణంతోపాటు దాదాపు 370 వంతెనల నిర్మాణ పనులతో బిజీగా ఉన్న రోడ్లు భవనాల శాఖ ఈ కొత్త రోడ్ల బాధ్యత ఎలా నిర్వహిస్తుందన్నది సందేహంగా మారింది.
 
 గతంలో పంచాయతీరాజ్ రోడ్లను తీసుకుని వాటి పనులను పూర్తి చేసేందుకు సంవత్సరాల కొద్ది సమయం తీసుకుంది. తమ పరిధిలో ఉండిఉంటే వాటిని ఓ స్థాయికి తెచ్చేవారమని, ఆర్‌అండ్‌బీ తీసుకున్నతర్వాత మామూలు నిర్వహణను కూడా చేయలేదని అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే రోడ్ల విషయంలో ఆర్‌అండ్‌బీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు