సీఎం కుర్చీ కోసం నువ్వా-నేనా?

14 Feb, 2017 20:16 IST|Sakshi

చెన్నై: తమిళనాడు సీఎం కుర్చీ కోసం పన్నీర్‌ సెల్వం, శశికళ వర్గాలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో రేసు నుంచి తప్పుకున్న శశికళ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. పళనిస్వామిని ముందుకు తీసుకొచ్చారు. తన శిబిరంలోని ఎమ్మెల్యేలతో ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకుని గవర్నర్‌ వద్దకు పంపారు. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని పళనిస్వామి.. గవర్నర్‌ కు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు. తర్వాత గోల్డెన్ బే రిస్టార్టుకు వెళ్లి గవర్నర్‌ తో భేటీ వివరాలను ‘చిన్నమ్మ’ చెవిన వేశారు.

శశికళ ఎత్తులతో కంగుతిన్న పన్నీర్‌ సెల్వం కూడా గవర్నర్ వద్దకు తన దూతలను పంపారు. సెల్వం ఆదేశాలతో మైత్రేయన్‌, పాండ్యన్‌.. రాజ్‌ భవన్‌ కు వెళ్లి గవర్నర్‌ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. బలనిరూపణకు అవకాశం ఇప్పించాలని గవర్నర్‌ కు మొర పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలతో బలవంతంగా సంతకాలు చేయించారని పాత రికార్డునే వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న గవర్నర్‌ ఎప్పటిలానే మౌనం దాల్చారు. న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి వారిని పంపిచారు. మరోవైపు శశికళను ఈ రాత్రికి బెంగళూరు జైలుకు తరలించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి...

శశికళకు ఎలాంటి పదవి లేదు

మరో రూపంలో సంక్షోభం

ఇక శశికళ రూటు అదే: నటి గౌతమి

శశికళకు ఆ హక్కు లేదు

తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..?

పళనిస్వామికి గవర్నర్ అపాయింట్‌ మెంట్‌

పన్నీర్‌ వర్సెస్‌ పళ​ని

మరిన్ని వార్తలు