స్తంభించిన పార్లమెంట్

11 Feb, 2014 02:00 IST|Sakshi
స్తంభించిన పార్లమెంట్

నాలుగో రోజూ సాగని సభలు
సమైక్య, తెలంగాణ నినాదాల హోరు
వెల్‌లోకి దూసుకెళ్లి సభ్యుల నిరసన
లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ సహా 4 అవిశ్వాసం నోటీసులు
గందరగోళం మధ్య సభ ముందు పెట్టలేకపోయిన స్పీకర్
రాజ్యసభలో పత్రాలు చించిన డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు
 ఉభయసభలూ నేటికి వాయిదా  

 
 సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా స్తంభించిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంతో పాటు.. మత హింస బిల్లు, తమిళ జాలర్ల సమస్యలపై పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టి, నినాదాలు చేయటంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం తలెత్తింది. లోక్‌సభ ఒకసారి, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడినా పరిస్థితి మారకపోవటంతో ఎలాంటి కార్యకలాపాలూ సాగలేదు. లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సీమాంధ్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నోటీసు ఇచ్చారు. వాటిని కూడా స్పీకర్ సభ ముందు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో అయితే పలువురు ఇతర ప్రాంత సభ్యులు అధికారిక పత్రాలను చింపివేసి చైర్మన్ వైపు విసిరేయటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. చివరకు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే రెండు సభలనూ సభాపతులు మంగళవారానికి వాయిదా వేశారు.
 
 లోక్‌సభ 12 నిమిషాల్లోనే వాయిదా..
 సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ సభ్యులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డిలతో పాటు పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి సమైక్య నినాదాలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అయినప్పటికీ సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించగా ఓ సభ్యుడు నదీకాలుష్యంపై ప్రశ్నించారు. ఆ హోరులోనే మంత్రి వీరప్పమొయిలీ సమాధానం ఇచ్చారు. కానీ సమాధానం వినిపించే పరిస్థితి లేకపోవడంతో ప్రారంభమైన మూడు నిమిషాల్లోనే స్పీకర్ మీరాకుమార్ సభను 12 గంటలకు వాయిదావేశారు.
 
 తిరిగి సభ సమావేశమయ్యాక వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు సమైక్య నినాదాలు చేయగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు శైలేంద్రకుమార్, ధర్మేంద్రయాదవ్, ఎం.ఆనందం తదితరులు వెల్‌లోకి వెళ్ళి తమ ప్రాంతాల సమస్యలపై నినాదాలు చేశారు. స్పీకర్ మాట్లాడుతూ ‘‘సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, కొనకళ్ల నారాయణరావు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిల నుంచి అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మూడు నోటీసులు వచ్చాయి. ఈ విషయాన్ని సభ ముందు ఉంచుతున్నాను. ఈ తీర్మానాలకు మద్దతిచ్చేందుకు 50 మంది సభ్యులు వారి స్థానాల్లో లేచి నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు నేను లెక్కించి వీటిని అనుమతించాలో లేదో నిర్ణయించగలను. కానీ ఈ ప్రక్రియకు సభ అదుపులో లేదు..’’ అని అన్నారు. సభ్యులు తమతమ సీట్లలోకి వెళ్లాలంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ అదుపులోకి రాలేదు. ఈ గందరగోళం మధ్యే సభను కొనసాగించగా పలువురు మంత్రులు తమ వార్షిక నివేదికలను సభ ముందుంచారు. గందరగోళం మరింత పెరగటంతో స్పీకర్ సభను 12 నిమిషాల్లోనే మంగళవారానికి వాయిదావేశారు.
 
 రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం
 రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు వెల్‌లోకెళ్లి ప్లకార్డులతో సమైక్య నినాదాలుచేశారు. సభాకార్యక్రమాలకు అంతరాయం కొనసాగుతుండగానే.. అస్సాంకు చెందిన సభ్యుడు బీరేంద్రప్రసాద్ మణిపురి బాలికపై అత్యాచారం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అలాగే పలువురు సభ్యుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. గత వారంలో వివిధ అంశాలపై నిరసనల తెలుపుతూ సభా నిబంధనలను అతిక్రమించారన్న కారణంతో వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్ (టీడీపీ), ఎన్.బలగంగ, ఎ.డబ్ల్యు.రబీబెర్నార్డ్, కె.ఆర్.అర్జునన్, టి.రత్నివేల్, ఆర్.లక్ష్మణన్ (ఏఐఏడీఎంకే), వసంతి స్టాన్లీ, ఎ.ఎ.జిన్నా, టి.ఎం.సెల్వగణపతి (డీఎంకే)లపై చర్యలు చేపట్టనున్నట్లు హౌస్ బులెటిన్‌లో పేర్కొనటం పట్ల ఆయా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ై
 
 మెత్రేయన్ (ఏఐఏడీఎంకే), సెల్వగణపతి (డీఎంకే)లు హౌస్ బులెటిన్ పత్రాలను చింపివేసి చైర్మన్ వైపు విసిరివేశారు. సభ అదుపు తప్పటంతో 10 నిమిషాలపాటు వాయిదావేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత బీరేంద్రప్రసాద్ మాట్లాడుతూ మన్మోహన్‌సింగ్ సర్కారు అత్యాచార ఘటనలను అడ్డుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. సభ నడిచే పరిస్థితి కనిపించకపోవడంతో రెండు నిమిషాల్లోనే 12 గంటలకు వాయిదా పడింది. మళ్లీ సమావేశమైన తర్వాత కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, జైరాంరమేశ్ తదితరులు వార్షిక నివేదికలను ప్రవేశపెట్టారు. అయినప్పటికీ సభ అదుపులోకి రాకపోవటంతో మరోసారి వాయిదాపడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, టీడీపీ సభ్యుడు సి.ఎం.రమేశ్ తదితరులు పెద్దసైజు ప్లకార్డులతో పోడియం వద్ద ఆందోళన చేశారు.
 
 ఈ సమయంలో తన ముఖం కనిపించకుండా చేయకండంటూ డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ కాస్త గట్టిగానే చెప్పినా ఫలితం లేకపోయింది. మైత్రేయన్ ఏకంగా చైర్మన్ ఎదుట ఉన్న మైక్రోఫోన్‌ను లాగివేసేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓ ఎంపీ ఏకంగా డిప్యూటీ చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సరైన ప్రవర్తన కాదని, వారికిది తగదని హితవు పలికారు. ఎయిడ్స్ రోగులకు సంబంధించిన బిల్లు అని, వారికి సహాయం చేయాలని మీకు లేదా? అని ప్రశ్నించారు. కానీ ఆందోళన చేస్తున్న సభ్యులు ఆయన మాట వినకపోవడంతో మూడు నిమిషాలకే తిరిగి మంగళవారానికి వాయిదాపడింది.

మరిన్ని వార్తలు