సమావేశాల తొలిరోజే రచ్చ రచ్చ

5 Feb, 2014 13:25 IST|Sakshi
సమావేశాల తొలిరోజే రచ్చ రచ్చ

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే సీమాంధ్ర సభ్యుల నిరసనల మధ్య మొదలయ్యాయి. దాంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉందంటూ విపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు  నిజమయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే రచ్చరచ్చ జరిగింది.

విభజన సెగతో లోక్‌సభ అట్టుడికింది. సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజిస్తోందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితుల్లో సభను మొదట 12 గంటలకు వాయిదా వేశారు.

తర్వాత సభ మళ్లీ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి సమైక్య నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు నినదించారు. 15వ లోక్‌సభ చివరి సమావేశాలు కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఎంపీలు శాంతించలేదు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ ఇదే వాతావరణం నెలకొంది. వెల్లోనికి దూసుకొచ్చిన సభ్యులపై ఛైర్మన్ హమీద్ అన్సారీ అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు, అనంతరం రెండు గంటల వరకూ వాయిదా పడింది.

మరిన్ని వార్తలు